Bhavish Aggarwal: వివాహిత మహిళా ఉద్యోగ నియామకాల విషయంలో ఫాక్స్‌కాన్ పై ఓలా ఫౌండర్ ఎండీ భవిష్ అగర్వాల్ స్పందించారు. దేశీయ టెక్ కంపెనీ ఫాక్స్‌కాన్ వివాహిత మహిళలను తన కంపెనీలో చేర్చుకోవడం లేదని ఆయన నొక్కి చెప్పారు. వివాహిత మహిళలను నియమించుకోవడంపై ఓలాకు ఎటువంటి విధానం లేదని అగర్వాల్ పేర్కొన్నారు.
ఇటీవల అగర్వాల్ ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘మహిళలు మరింత క్రమశిక్షణ, నైపుణ్యంతో ఉంటారు. మేము మా కార్యకలాపాల్లో మహిళా శ్రామికశక్తిని నియమించుకోవడం కొనసాగిస్తాం. వివాహితులను నియమించుకోకూడదనే ఫాక్స్‌కాన్ లాంటి విధానాలు మా దగ్గర లేవు. భారతదేశంలో మహిళా శ్రామిక శక్తి తక్కువగా ఉంది. ఈ లోటును భర్తీ చేసేందుకు మా వంతు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జూనియర్ స్థాయి కోసం నియమించుకుంటున్నాం. సీనియర్ మేనేజ్‌మెంట్‌కు కూడా ఎక్కువ మంది మహిళా ఉద్యోగులను నియమించుకునేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని చెప్పారు.
అంతకు ముందు ఓలా ఎలక్ట్రిక్ బ్లాగ్ పోస్ట్ లో ‘ఈ రోజు, ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీని పూర్తిగా మహిళలే నడుపుతారని ప్రకటించేందుకు నేను గర్విస్తున్నాను. ఈ వారం మొదటి బ్యాచ్ విధుల్లో చేరుతున్నారు. పూర్తి సామర్థ్యంతో, ఫ్యూచర్ ఫ్యాక్టరీ 10,000 మందికి పైగా మహిళలకు ఉపాధి కల్పిస్తుంది. ఇది ప్రపంచంలోనే మహిళలు పని చేసే అతిపెద్ద ఫ్యాక్టరీ, ప్రపంచ ఏకైక మహిళా ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మారుతుంది. తమ మహిళా కార్మికుల కథలను పంచుకునేందుకు కంపెనీ యూట్యూబ్ లో ఒక చిన్న క్లిప్ ను కూడా పంచుకుంది.