Virat and Rohit: దశాబ్దానికి మించి ఎదురు చూస్తే టీ20 వరల్డ్ కప్ చేతికి చిక్కింది.. ఐర్లాండ్ నుంచి మొదలుపెడితే దక్షిణాఫ్రికా వరకు వరుస విజయాలు సాధించి టీమిండియా ఛాంపియన్ అయింది. ఇంతటి విజయం వెనుక టీమిండియా ఎన్నో కష్టాలు పడింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఓడిపోయింది.. టెస్ట్ ఛాంపియన్ షిప్ కోల్పోయింది. ఇన్ని ఓటముల వెలితిని టి20 వరల్డ్ కప్ దక్కించుకోవడం ద్వారా పూడ్చుకుంది. ఈ విజయంతో టీమిండియా ఆటగాళ్లలో ఆనందం కట్టలు తెంచుకుంటున్నది. టీ 20 వరల్డ్ కప్ సాధించి మూడు రోజులవుతున్నా.. సోషల్ మీడియా, మీడియాలో దీనికి సంబంధించిన వార్తలే తెగ సందడి చేస్తున్నాయి.
టి20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేసాడు. ఇక రోహిత్ శర్మ కూడా అతడి దారినే అనుసరించాడు. మరోవైపు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టి20 క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. దీంతో రోహిత్ శర్మ వారసుడు ఎవరు అనే ప్రశ్న మొదలైంది? హార్దిక్ పాండ్యాను నియమిస్తారని కొంతమంది అంటుంటే.. బుమ్రా కు అవకాశం ఇస్తారని మరి కొంతమంది చెబుతున్నారు. గిల్ నియమించే విషయాన్ని కొట్టిపారేలేమని ఇంకొందరు మాజీ క్రీడాకారులు అంటున్నారు. అయితే జింబాబ్వే టూర్ తర్వాతే టీమిండియా కు కొత్త కెప్టెన్ వస్తాడని తెలుస్తోంది. ఇదే సమయంలో కొత్త కోచ్ కూడా టీమిండియాతో జాయిన్ అవుతాడని ప్రచారం జరుగుతోంది. ద్రావిడ్ పదవి కాలం ముగియడంతో ఆ స్థానాన్ని గౌతమ్ గంభీర్ తో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ధీటైన పోటీ లేకపోవడంతో కచ్చితంగా గౌతమ్ గంభీర్ కి అవకాశం కల్పిస్తారని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఇక టి20 ఫార్మాట్ కు రోహిత్, విరాట్ వీడ్కోలు ప్రకటించిన నేపథ్యంలో.. మిగతా ఫార్మాట్లలోనూ ఎక్కువ కాలం కొనసాగారని జాతీయ మీడియా కోడై కూస్తోంది. సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సందేహాలన్నింటికీ బీసీసీఐ సెక్రటరీ జై షా ఫుల్ స్టాప్ పెట్టారు వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ టోర్నీల వరకు విరాట్, రోహిత్ ఆడతారని జై షా పేర్కొన్నారు. టీమిండియా వీరిద్దరి ఆధ్వర్యంలో ఆ రెండు టోర్నీలను కూడా గెలవాలని ఆయన ఆకాంక్షించారు. దీంతో జై షాను ఆకాశానికి ఎత్తుతూ విరాట్, రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. అభిమానుల వాలకం చూస్తుంటే జై షా కు గుడి కట్టేస్తారేమోనని.. క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.