ntv reporter Jameer : దేశమంతా ఇప్పుడు ఒకటే న్యూస్. అదే భారీ వర్షాలు.. ఆ న్యూస్ కవర్ చేయడానికి వెళ్లిన ఓ న్యూస్ చానెల్ జర్నలిస్ట్ గల్లంతు కావడం విషాదం నింపింది. గిరిజన కూలీలు 9 మంది వరదలో చిక్కుకున్నారని తెలుసుకున్న జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గోదావరిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.
రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలోని, గోదావరి నదిలో చిక్కుకున్న 9 మంది వ్యవసాయ కూలీల వార్త కవరేజ్ చేసేందుకు వెళ్లిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ తన వాహనంతో సహా వాగులో కొట్టుకుపోగా.. ఘటన తెలిసిన తోటి పాత్రికేయులు విషాద వలయంలో మునిగిపోయారు.
రాయికల్ లో వరదలో చిక్కుకున్న వారి న్యూస్ కవరేజ్ కి వెళ్లి నీటిలో వరద నీటిలో గల్లంతయిన జగిత్యాల ఎన్టీవీ జర్నలిస్ట్ జమీర్ కోసం ఎన్డీఆర్ఎఫ్ సహా పోలీసులు గజ ఈతగాళ్లు వెతుకుతున్నారు.
తన తోటి మిత్రుడుతో కలిసి కారులో జమీర్ బయలు దేరారు. వీరు రాయికల్ మండలం రామోజీపేట, భూపతిపూర్ గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్ట్ దాటుతుండగా ఉధృతంగా ప్రవహిస్తున్న నీటి ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఇందులో జర్నలిస్ట్ జమీర్ మిత్రుడు ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకొని రామోజీ పేటకు చేరుకున్నాడు.
ఈ సమాచారం అందుకున్న స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు జర్నలిస్ట్ జమీర్ కోసం వెతుకుతున్నారు. జమీర్ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. జిల్లా అధికార యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు సమాయత్తమైంది.