Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో వర్షబీభత్సం కొనసాగుతోంది. ఐదురోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ముఖ్యంగా తెలంగాణ తడిసి ముద్దయింది. దీంతో వరదలు ఏరులై పారుతున్నాయి. ప్రధానంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ఊహించనంత వరద రావడంతో తెలంగాణలోని గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. దీంతో ఏపీలో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఫలితంగా గోదావరి తీరాన ఉన్న ప్రజలు నీళ్లలోనే జీవితాన్ని గడుపుతున్నారు. వర్షాలు పడడం.. వరదలు రావడం కొత్తేమీ కాదు… అలాగని వరద కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా గోదారి తీర ప్రజల సమస్యలు తీరడం లేదు. ఎన్నడూ లేనంతగా వర్షం కురిసిందని, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. కానీ వరదలో కొట్టుకుపోతున్న ప్రజల గురించి ఎవరూ ఆలోచించడం లేదు.
మాములుగా ప్రకృతి విపత్తుకు ఎవరూ ఏం చేయలేరు. కానీ వర్షాకాలంలో వరదలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో వరదల నుంచి తమ ప్రజలను ఎలా కాపాడాలి అన్న విషయం మాత్రం పాలకులు ఆలోచించడం లేదు. ఏపీ విషయానికొస్తే పొలవరం ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించారు. కానీ ఇప్పటికీ ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. ఈ ప్రాజెక్టుతో తమ జీవితాలు బాగుపడుతాయనుకున్న ఎంతో మంది భూములిచ్చి నిరాశ్రయులయ్యారు. కానీ వారి గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. దీంతో వరదలు వచ్చిన ప్రతీసారి గోదారి ఉప్పొంగి సమీప గ్రామాల్లోకి నీరు ప్రవేశిస్తోంది.
Also Read: Ntv Reporter Jameer : వరదలో కొట్టుకుపోయిన ఎన్టీవీ రిపోర్టర్
ఇదే గోదావరిపై తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో కాళేశ్వరం పేరిట మూడు ప్రాజెక్టులను నిర్మించింది. కానీ ఏపీలోని పోలవరం మాత్రం ముందుకు సాగడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని సమస్యను విభజిత ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చినా పాలకులు పట్టించుకోవడం లేదు. మొన్న కడప జిల్లాలోనూ అన్నమయ్య ప్రాజెక్టు డేంజర్ స్థితిలో ఉందని హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ఎందరో నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ సమీప గ్రామాల్లోని ప్రజలు టెంట్ల కిందే జీవిస్తున్నారు. ఇప్పుడు పోలవరం విషయంలోనూ ప్రభుత్వం అంతే నిర్లక్ష్యం వహిస్తోంది. ఈ ప్రాజెక్టు పేరిట ప్రచారం చేసుకొని రెండు పార్టీలు మారాయి. అధికారంలోకి వచ్చాయి. కానీ ఏ పార్టీ పూర్తి చేయలేకపోయింది. తెలుగుదేశం ప్రభుత్వంలో కాపర్ డ్యాం స్టేజికి తీసుకొచ్చినా వైసీపీ ప్రభుత్వం మాత్రం కనీస పనులు పూర్తి చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి.
వందేళ్ల రికార్డును మళ్లీ వర్షం తిరగరాసిందని చెబుతున్నారు. కానీ ఈ వరదలో ఎంతమంది నిరాశ్రయులవుతున్నారన్న విషయంపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. పై నుంచి ఆదేశాలు వస్తేనే చేస్తామని అధికారులు.. వర్షాల నేపథ్యంలో ఆదేశాలు లేకుండా కూడా ప్రజలకు అండగా ఉండాలని పాలకులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం వరదలో చిక్కుకుంటున్నారు. ప్రజలు తమ సమస్యలు తీర్చాలని కోరుతారు. కారణాలు చెప్పమని కాదు..కానీ ప్రభుత్వం మాత్రం వర్షం పడిన తీరును గమనిస్తూ చల్లగా కాలం గడుపుతోంది.
Also Read:Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధాని రేసులో ముందంజలో మన రిషి సునాక్..ముహూర్తం ఖరారు