దేశంలో లాక్డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. దీంతో ఈ ఏడాది కొత్త పథకాలకు శ్రీకారం చుట్టేది లేదని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం స్పష్టం చేసింది. కరోనా మహమ్మరి విజృంభణ, లాక్డౌన్ కారణంగా కేంద్రం పెద్దమొత్తంలో ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. తిరిగి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఇటీవలే కేంద్రం 20లక్షల ప్యాకేజీ ప్రకటించింది. దీనివల్ల ఖర్చులు పెరిగిపోవడంతో ఈ ఏడాది ఎలాంటి కొత్త పథకాలను ప్రవేశపెట్టకూడదని కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన రెండు పథకాలకు ఆర్థిక శాఖ మినహాయింపు ఇచ్చింది. ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీ, ఆత్మ నిర్భర భారత్ పథకాలకు ఆర్థిక శాఖ సడలింపు ఇచ్చింది. ఈ రెండు పథకాలకు మాత్రమే ఆర్థిక శాఖ నుంచి నిధులు వెచ్చించనున్నట్లు ప్రకటించింది. మరే కొత్త పథకాలను ఏ శాఖ ప్రకటించొద్దని తేల్చి చెప్పింది. కొత్త పథకాలకు ఇప్పట్లో ఆర్థిక శాఖ నుంచి నిధులు లేవని స్పష్టం చేసింది.
కోవిడ్-19 వైరస్ కారణంగా ప్రజా ఆర్థిక వనరులకు డిమాండ్ పెరిగిందని ఆర్థిక శాఖ పేర్కొంది. మారుతున్న పరిస్థితులను అనుగుణంగా అవసరమున్న వాటికే నిధులు వెచ్చించనున్నట్లు ఆ శాఖ ప్రకటించింది. ఇప్పటికే బడ్జెట్లో ఆమోదించిన పథకాలను 2022 మార్చి 31వరకు నిలిపివేస్తున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రం కేంద్రం ఖర్చులకు సంబంధించి, తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని నిధులను విడుదల చేస్తుందని ఆర్థిక శాఖ ప్రకటించింది.