
ఎవరికి ఏదీ శాశ్వతం కాదు.. అందులోనూ ఉద్యోగాలైతే.. ప్రతీ ఉద్యోగికి రిటైర్‌మెంట్ తప్పనిసరి. అందుకే.. ఉద్యోగంలో ఉన్నన్నీ రోజులు ఎలా మలచుకోవాలో అలా ఉంటే అందరితో భేష్ అనిపించుకోవచ్చు. కానీ.. ఈ నెలాఖరులో రిటైర్డ్ అవ్వబోతున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం కొంత అత్యుత్సాహం ప్రదర్శించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొన్నారు. నిమ్మగడ్డ తనకు ఎస్‌ఈసీ పదవి శాశ్వతం అనే రీతిలో ప్రవర్తించారు. ఎస్ఈసీగా రాజ్యాంగం ఆయనకు ఇంతవరకూ అండగా ఉంటూ వచ్చింది. అలాగే కీలకమైన పదవిలో ఉండడంతో ప్రతిపక్ష పార్టీలు కూడా తమ వంతు మద్దతుగా నిలిచాయి.
న్యాయస్థానాల్లో కోట్లాది రూపాయలు ఫీజుల చెల్లింపు వెనుక టీడీపీ హస్తం ఉందనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఇందులో నిజానిజాలను పక్కన పెడితే, ఆ రకమైన ప్రచారం విస్తృతంగా సాగి నిమ్మగడ్డపై టీడీపీ ముద్రపడేందుకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ తర్వాత కూడా నిమ్మగడ్డకు జగన్ సర్కార్ నుంచి ఇబ్బందులు తప్పేలా లేవు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన ఎన్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ నుంచి వివరణ కోరాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించింది. ఆయన ఇచ్చే వివరణపైనే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
అయితే.. నిమ్మగడ్డ ఇచ్చే వివరణతో ప్రివిలేజ్ కమిటీ సంతృప్తి చెందుతుందని ఏ ఒక్కరూ భావించడం లేదు. నిమ్మగడ్డను అరెస్ట్ చేసేంత వరకూ జగన్ సర్కార్ నిద్రపోదని కొంత కాలంగా ఏపీలో చర్చలో నడుస్తోంది. ఒకవేళ అదే జరిగితే నిమ్మగడ్డను కాపాడేదెవరు? ఇప్పుడిదే అసలుసిసలు ప్రశ్న. ఎస్ఈసీ హోదాలో కోర్టుకెళ్లడానికి కూడా ఆయనకు అవకాశం ఉండదు.
అలాగని ఏ హోదాలో లేని నిమ్మగడ్డ ఆలనాపాలనా చూసుకోడానికి చంద్రబాబేమీ అమాయకుడు కాదు. తన సమస్యల నుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డకు ఇక దిక్కెవరనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ, లేని ఉద్దేశాలను అంటకడుతూ కేంద్ర హోంశాఖకు లేఖ రాయడాన్ని నిమ్మగడ్డ మరిచిపోయి ఉండొచ్చు. కానీ ఆ లేఖ చేసిన గాయంతో రగిలిపోతున్న వాళ్లు అంత సులభంగా విడిచిపెడతారని ఎవరూ అనుకోరు. మొత్తంగా.. నిమ్మగడ్డ చేసిన పనులకు ఆయనపై పెద్దగా ఎవరికీ సానుభూతి కలగడం లేదు.