ఏపీలో మొన్నటివరకు మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా తేలాయి. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడైనా.. తాడిపత్రి, మైదుకూరులో మాత్రం హంగ్ ఏర్పడ్డాయి.రాయలసీమలోని ఈ రెండు మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. దీంతో పాలక వర్గాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ లేకుండాపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగినప్పటికీ.. ఈ రెండు చోట్ల టీడీపీని అడ్డుకోలేకపోయింది. ఒకవిధంగా చెప్పాలంటే ఆ రెండు స్థానాల్లోనూ టీడీపీకంటే తక్కువ సీట్లనే సాధించింది అధికార వైసీపీ.
Also Read: అర్థం కాని రాజగోపాల్ వైఖరి.. బీజేపీ స్వాగతిస్తుందా..?
తాజాగా..- ఎక్స్ అఫీషియో ఓట్ల ద్వారా ఈ రెండు మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనుకున్న అధికార పార్టీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. తాడిపత్రి మున్సిపాలిటీపై పసుపు జెండా ఎగిరింది. మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన ఎన్నికను ప్రిసైడింగ్ అధికారి జీఆర్ మధుసూదన్ ప్రకటించారు. వైస్ చైర్మన్ స్థానాన్ని కూడా టీడీపీనే గెలుచుకుంది. వైస్ చైర్ పర్సన్‌గా పి.సరస్వతి నియమితులయ్యారు.
వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సయ్యద్ బాషాకు 18 ఓట్లు పోల్ అవ్వగా.. టీడీపీ అభ్యర్థి జేసీ ప్రభాకర్ రెడ్డికి 21 ఓట్లు వచ్చాయి. పాలక మండలిని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 20. ఆ సంఖ్యను టీడీపీ అందుకోవడం వల్ల టీడీపీ విజయం సాధించినట్లుగా ప్రిసైడింగ్ అధికారి మధుసూదన్ ప్రకటించారు. కాగా..- హంగ్ ఏర్పడిన మైదుకూరు మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకోగలిగింది. చైర్మన్ పదవి దక్కించుకుంది. చైర్మన్‌గా మాచనూరు చంద్ర, వైస్ చైర్మన్ గా మహబూబ్ షరీఫ్ ఎన్నికయ్యారు. వారితో కమిషనర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
Also Read: టీడీపీకి బై.. వైసీపీకి జై.. కామ్రెడ్స్ కొత్త రాగం
ఈ మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ నుంచి 12 మంది వైసీపీ నుంచి 11 మంది విజయం సాధించారు. ఒక స్థానాన్ని జనసేన గెలుచుకుకుంది. చైర్మన్ ఎన్నిక కార్యక్రమానికి టీడీపీ నుంచి 11 మంది మాత్రమే హాజరయ్యారు. వైసీపీకి చెందిన కడప లోక్‌సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి, అదే పార్టీకి చెందిన మైదుకూరు శాసన సభ్యుడు రఘువీరా రెడ్డి ఎక్స్అఫిషియో సభ్యులుగా హాజరయ్యారు. వారి ఓట్లతో వైసీపీ మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోగలిగింది. జనసేన నుంచి గెలిచిన వార్డు సభ్యుడు తటస్థంగా నిలిచారు. ఏ పార్టీకీ ఆయన మద్దతు ప్రకటించలేదు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్