ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఓ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. దళిత యువకుడు కిరణ్ కుమార్ పొలీసు కస్టడీలో మరణించడం విమర్శలకు దారితీసింది. పోలీసులు కిరణ్ కుమార్ మాస్క్ ధరించలేదన్న కారణంతో దారుణంగా తలపై కొట్టారని, దానితో కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు, అనేది కిరణ్ కుటుంబ సభ్యుల వాదన. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడ్డాయి. బాధ్యులైన పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలని ఆందోనలు చేశాయి. మరో ప్రక్క ప్రతిపక్ష టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని, వారిపై వరుస దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇక టీడీపీ నేత వర్ల రామయ్య జాతీయ ఎస్పీ, ఎస్టీ కమీషన్ కి లేఖ రాయడం జరిగింది.
Also Read: చంద్రబాబు విధానాలే అమరావతికి శాపమా?
ఐతే ఈ ఘటనలో పోలీసుల వర్షన్ వేరుగా ఉంది. మృతుడు కిరణ్ కుమార్ మరియు అతని స్నేహితుడు బైక్ పై మాస్క్ లేకుండా వెళుతుండగా పోలీసులు ఆపడం జరిగింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న కిరణ్ కుమార్ మరియు అతని స్నేహితుడు పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారట. దీనితో చీరాల టూ టౌన్ ఎస్ ఐ విజయ్ కుమార్ వీరిద్దరిని పోలీసు జీపులో స్టేషన్ కి తరలిస్తుండగా, కిరణ్ కుమార్ జీపులో నుండి దూకి పారిపోయే ప్రయత్నం చేశాడట. ఈ క్రమంలో కిరణ్ కుమార్ తలకి తీవ్ర గాయం కావడంతో ఆయన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారట. అక్కడ చికిత్స పొందుతూ కిరణ్ కుమార్ తదుపరి రోజు మరణించాడనేది పోలీసుల కథనం.
Also Read: తుమ్మలకు మరోసారి అదృష్టం వరించనుందా?
ఈ వ్యవహారంలో అసలు నిజం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఐతే కిరణ్ కుమార్ ని ఎస్సై విజయ్ కుమార్ తీవ్రంగా కొట్టినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు కుటుంబ సభ్యులు. మృతుడితో పాటు సంఘటనలో ఉన్న స్నేహితుడు కిరణ్ ని పోలీసులు తీవ్రంగా గాయపరిచినట్లు చెప్పారని, మావద్ద ఆడియో సంభాషణలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఘటనపై కిరణ్ కుటుంబ సభ్యులు సమగ్ర దర్యాప్తు కోరుకుంటున్నారు. ఘటన జరిగిన వెంటనే సీఎం జగన్ మృతుడు కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే బాధ్యులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు.