కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ర్టాలు మళ్లీ లాక్ డౌన్లు విధిస్తున్నాయి. జులై నుండి కొత్త లాక్ డౌన్ రూల్స్ అమలులోకి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటకలో ఇకపై ప్రతి ఆదివారం లాక్ డౌన్ విధించబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. జూలై ఐదు నుంచి దీన్ని అమలుచేయనున్నారు. సోమవారం నుంచి కర్ఫ్యూ రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు శనివారం కూడా సెలవు ప్రకటించింది. చెన్నైలో ఇప్పటికే ఆదివారాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలుచేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాక్ డౌన్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 తర్వాత కూడా రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం ప్రకటించారు. పశ్చిమబెంగాల్ లో కరోనా వ్యాప్తి కట్టడికి జూలై 31 వరకు లాక్ డౌన్ విధించారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ లాక్ డౌన్ విధించాలన్న ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకొంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లాక్ డౌన్ విధించాలని నిర్ణయించుకొంటే, అనేక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ విధిస్తే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా అమలుచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోళ్లుచేయడానికి వీలుగా ఒకటి రెండు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చి, రోజంతా కర్ఫ్యూ విధించాల్సి ఉంటుందని తెలిపారు. విమానాల రాకపోకల్ని ఆపాల్సి ఉంటుందని, ప్రభుత్వ పరంగా అన్ని సిద్ధంచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని విషయాలను లోతుగా పరిశీలించిన తరువాత మూడు నాలుగు రోజుల్లో సరైన వ్యూహాన్ని ఖరారుచేస్తామని వెల్లడించారు.