New Driving Licence Rules 2024: డ్రైవింగ్‌ లైసెన్స్‌ మరింత ఈజీ.. ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే..

డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది. కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతులు మంజూరు చేస్తారు.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 12:24 pm

New Driving Licence Rules 2024

Follow us on

New Driving Licence Rules 2024: మీకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ కావాలా.. ఆర్టీవో కార్యాలయానికి వెళ్తున్నారా.. జూన్‌ 1 నుంచి మీరు ఆర్టీవో కార్యాలయానికి వెళ్లకుండానే లైసెన్స్‌ పొందవచ్చు. పెద్దమొత్తంలో డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. ఈమేరకు కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఇటీవల మార్గదర్శకాలు జారీ చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ పొందే విధానాన్ని మరింత సులభతరం చేసింది. కొత్త నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫై చేయాల్సి ఉంటుంది. అందుకు అనుగుణంగా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు దరఖాస్తు చేసుకుంటే వారికి అనుమతులు మంజూరు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని తెలిసింది.

కీలక మార్పులివే..

– డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీ చేసే సమయంలో నిర్వహించే డ్రైవింగ్‌ టెస్ట్‌ కోసం ఎకపై ప్రాంతీయ రవాణాకార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ డ్రైవింగ్‌ స్కూళ్లలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దరఖాస్తు దారుడు టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే స్కూళ్లు వారికి ఒక ధ్రువపత్రం జారీ చేస్తాయి. వాటితో ఆర్టీవో కార్యాలయంలో లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహించేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం ప్రైవేటు సంస్థలకు సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. అవి లేని స్కూళ్లలో డ్రైవింగ్‌ నేర్చుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్టీవో కార్యాలయాల్లో టెస్టుకు వెళ్లాలి.

– ఇక కొత్త నిబంధనల ప్రకారం లైసెన్స్‌ లేకుండా వాహనం నడిపితే రూ.2 వేల వరకు జరిమానా విధిస్తారు. మైనర్లు డ్రైవ్‌ చేస్తే రూ.25 వేల పెనాల్టీ కట్టాలి. వాహనం రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కూడా రద్దు చేస్తారు. 25 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆ మైనర్‌ లైసెన్స్‌కు అనర్హుడవుతాడు.

– లైసెన్స్‌ దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాల సంఖ్యను కొత్త నిబంధనల్లో కుదించారు. ఇవి వాహనాన్ని బట్టి (ద్విచక్ర, త్రిచక్ర, భారీ వాహనాలు..) వేర్వేరుగా ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని మాత్రం కేంద్రం మార్చలేదు.

– వాతావరణ కాలుష్యం తగ్గించడంలో భాగంగానే పెద్దమొత్తంలో ప్రభుత్వ వాహనాలను తొలగించాలని కేంద్రం నిర్ణయించింది. ఇతర వాహనాలకు ఉద్గారాల ప్రమాణాలను పెంచారు. పరోక్షంగా విద్యుత్‌ వాహన వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహించింది.

కొత్త నిబంధనల ప్రకారం ఫీజులు ఇలా..

1. లెర్నర్స్‌ లైసెన్స్‌ రూ.200

2. లెర్నర్స్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ రూ.200

3. ఇంటర్నేషనల్‌ లైసెన్స్‌ రూ.1,000

4. పర్మినెంట్‌ లైసెన్స్‌ రూ.200

5. పర్మినెంట్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ రూ.200

6. రెన్యువల్‌ చేసిన డ్రైవర్‌ లైసెన్స్‌ జారీ రూ.200

7. లైసెన్స్‌ వివరాల్లో మార్పులు రూ.200

ప్రైవేట్‌ డ్రైవింగ్‌ స్కూళ్లకు మార్గదర్శకాలు..

– డ్రైవింగ్‌ శిక్షణ కేంద్రాలకు కనీసం ఒక ఎకరం స్థలం ఉండాలి. పెద్ద వాహనాల శిక్షణకైతే రెండు ఎకరాలు ఉండాలి.

– స్కూళ్లలో డ్రైవింగ్‌ టెస్ట్‌ నిర్వహణకు సంబంధించిన వసతులు ఉండాలి.

– శిక్షణ ఇచ్చేవాళ్లకు కనీసం హైస్కూల్‌ డిప్లొమా (సమానమైన అర్హత) ఉండాలి. డ్రైవింగ్‌లో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. బయోమెట్రిక్స్‌ సహా ఐటీ సిస్టమ్స్‌పై అవగాహన అవసరం.

– లైట్‌ మోటార్‌ వాహనాలకు గరిçష్టంగా నాలుగువారాల్లో 29 గంటల శిక్షణ ఇవ్వాలి. 21 గంటలు ప్రాక్టికల్, 9 గంటలు థియరీ సెషన్‌గా విభజించారు. మీడియం, హెవీ వెహికల్స్‌కు అయితే ఆరు వారాల్లో కనీసం 38 (31 + 8) గంటల శిక్షణ అందించాలి.

– ట్రైనింగ్‌ ఇవ్వకుండా లైసెన్స్‌ జారీ లేదా రెన్యువల్‌ చేస్తే డ్రైవింగ్‌ స్కూళ్లు రూ.5 వేల జరిమానా విధిస్తారు.