AP Elections 2024 : ఈవీఎంల ధ్వంసమే కాదు.. మనుషుల ప్రాణాలతో చెలగాటం కూడా..

ఇప్పుడే పట్టించుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణ చర్యలు ఒక్కొక్కటి బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Written By: NARESH, Updated On : May 24, 2024 12:06 pm

AP Elections 2024

Follow us on

AP Elections 2024 : పిన్నెల్లి వ్యవహారం ఒక్క పోలింగ్ బూత్ కి పరిమితం కాలేదు. కేవలం ఈవీఎం మిషన్లే ధ్వంసం చేయలేదు. మనుషుల ప్రాణాలతో సైతం ఆయన చెలగాటం ఆడారని తెలుస్తోంది. పోలింగ్ నాడు ఆయన లీలలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఆయన అనుచరుల దాడిలో ఏ పార్టీకి సంబంధం లేని ఓ యువకుడు చిక్కుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. మరో ఆరు నెలల పాటు ఆయన మంచానికి పరిమితం కావాల్సి ఉంటుంది. దీంతో ఆయన భార్య, వృద్ధ తల్లిదండ్రులు పడుతున్న బాధ వర్ణనాతీతం. ఆ రోజు ఏం జరిగిందో బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

వెల్దుర్తి మండలం కేపీ గూడెం పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏ పార్టీకి సంబంధంలేని భవానీ ప్రసాద్ అనే యువకుడు పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికి భోజనాలు తీసుకెళ్లేందుకు వెళ్లాడు. అదే సమయంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి ఏడు వాహనాల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కర్రలు బీరు సీసాలతో టిడిపి వారి కోసం వెతికారు. ఆ సమయంలో అక్కడున్న వారు పరుగులు తీశారు. అందులో భవాని ప్రసాద్ కూడా ఉన్నారు. పరుగు పెడుతుండగా భవానీ ప్రసాద్ సెల్ ఫోన్ పడిపోయింది. ఫోన్ కోసం వెతుకుతుండగా.. ఆ సమయంలో కారుతో వచ్చి ఢీకొట్టారు. అంత దూరం ఎగిరి పడగా.. నడుం పైనుంచి కారును పోనిచ్చారు. అంటూ భవాని ప్రసాద్ కన్నీటి పర్యాంతం అవుతూ చెబుతున్నారు.

ప్రస్తుతం భవానీ ప్రసాద్ కాళ్లు పనిచేయడం లేదు. నడుం విభాగం అచేతనంగా ఉండిపోయింది. దీంతో పూర్తి బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి. కనీసం ఆయన కోలుకోవడానికి ఆరు నెలల సమయం పడుతుంది. పనికి వెళ్తే కానీ పూట గడవని దుస్థితి వారిది. దీంతో తాము ఎలా బతకాలి అని ఆ వృద్ధ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో సైతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు దాడులకు తగబడినట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే వారి పేర్లు బయట పడుతున్నాయి. ఇప్పుడు భవాని ప్రసాద్ వ్యవహారం కూడా వెలుగులోకి రావడంతో పోలీస్ అధికారులు స్పందిస్తున్నారు. ఎన్ని రోజులపాటు పట్టించుకోకుండా ఉండేవారని.. ఇప్పుడే పట్టించుకుంటున్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మొత్తానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దారుణ చర్యలు ఒక్కొక్కటి బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.