Nathuram Godse: మన దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన నేత జాతిపిత. ప్రజలను ఏకతాటిపైకి తెచ్చి సత్యం, అహింస ఆయుధాలతో తెల్లవారిని తరిమిన ఘనుడు.. మహానుభావుడు. అంతటి ఖ్యాతి ఆర్జించిన మహాత్మగాంధీని ప్రస్తుతం కొందరు నిందిస్తూ పోస్టులు పెట్టడం దారుణం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిన మహాత్ముడిని మంచి వాడు కాదని సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టడాన్ని అందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ మధ్య ప్రతి విషయాన్ని తప్పుగా చూపడం అలవాటుగా మారుతోంది.

దేశంలో నేడు విశృంఖల దేశభక్తి పెరిగిపోతోంది. ప్రతి వారు ఎవరికి వారే వారిదే న్యాయంగా పేర్కొంటూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు. ఫలితంగా జాతిపితపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఆయన వల్లే దేశానికి నష్టం జరిగిందని పేర్కొంటున్నారు. డెబ్బయ్యేళ్లుగా మనం కీర్తిస్తున్న మహాత్మ గాంధీ కొందరు కావాలనే దురుద్దేశ పూర్వకంగా నిందలు మోపుతున్నారు. దీంతో నెటిజన్ల తీరు ఆక్షేపణ తీరుగా ఉంటోంది.
గాంధీజీని చంపిన నాథూరాం గాడ్సేను హీరోగా అభివర్ణిస్తూ పోస్టులు పెట్టడంపై అందరిలో ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. దేశభక్తి అంటే ఇలా విమర్శలు చేయడమేనా అని సంశయిస్తున్నారు. జాతిపిత మహాత్మగాంధీ నిర్ణయాలను తప్పుబడుతూ ఆయనపై నిందలు మోపడాన్ని అందరు తప్పుబడుతున్నారు. దీనికి కారణమైన వారిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడంలో ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారో అర్థం కావడం లేదు.
గాంధీని నిందించి వారు ఏం సాధించారో అర్థం కావడం లేదని పలువరు ఎదురుదాడి చేస్తున్నారు. ఆయనలోని మంచిని వదిలేసి చెడును ప్రచారం చేసే విధంగా చేయడంలో వారు ఎందుకు ఉత్సాహపడుతున్నారో అర్థం కావడం లేదు. ప్రజల్లో బావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవాలని చూసే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. అందుకే ఇలాంటి పోస్టులు పెడుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు.