Balakrishna: నట సింహం రంగంలోకి దిగింది. అందరూ ఊహించినట్టుగానే బాలయ్య తన సపోర్ట్ మంచు విష్ణుకు ధారాదత్తం చేశాడు. త్వరలో జరగబోయే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు మధ్య పోటీ రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మేమంటే మేము అంటూ ఇరు వర్గాలు బరిలో నిలిచాయి. పోటీ తీవ్రత దెబ్బకు ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతూ సాగుతుంది. అయితే, ఎవరు ఎన్ని మలుపులు తిరిగినా.. అంతిమ లక్ష్యం గెలుపే.

కానీ ఆ గెలుపు రావాలి అంటే.. వెనుక బలమైన అండ ఉండాలి. ప్రకాశ్ రాజ్ కి మెగాస్టార్ అండ లభించింది. ఇక పవర్ స్టార్ అయితే డైరెక్ట్ గానే ప్రకాష్ రాజ్ వైపు మాట్లాడాడు. ఈ నేపథ్యంలో మంచు విష్ణుకి బాలయ్య సపోర్ట్ లభించడం కీలకమైన పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలంటే బాలయ్య మద్దతు చాలా అవసరం. ఒక విధంగా ‘మా’ మెంబర్స్ లో బాలయ్య వర్గమే ఎక్కువగా ఉన్నారు.
అయితే, బాలయ్య మంచు ఫ్యామిలీకి సపోర్ట్ చేయరు అని ఇన్నాళ్లు టాక్ నడిచింది. కారణం.. గత ఏపీ రాజకీయ ఎన్నికల్లో మంచు ఫ్యామిలీ టీడీపీకి వ్యతిరేకంగా పని చేసి ఓడించింది. మరి ఇప్పుడు బాలయ్య, మంచు ఫ్యామిలీకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు అన్నారు. కానీ మంచు విష్ణు మాత్రం, బాలయ్య సపోర్ట్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేసి మొత్తానికి సాధించాడు.
తాజాగా అఖండ సెట్ కు వెళ్లి మరీ మంచు విష్ణు బాలకృష్ణను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా బాలయ్యతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఒక మెసేజ్ కూడా పెట్టాడు. ‘మా బాల అన్న నన్ను ఆశీర్వదించి, మా ప్రెసిడెంట్ గా నాకు పూర్తి మద్ధతు ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ విష్ణు పోస్ట్ చేశారు. ఒక విధంగా ‘మా’ ఎన్నికల్లో ఇది టర్నింగ్ పాయింటే.
ఎందుకంటే మెగాస్టార్ డైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ కి తన మద్దతు ప్రకటించలేదు. కానీ, బాలయ్య మాత్రం మంచు విష్ణుకు తన సంపూర్ణ మద్దతు ప్రకటించడం విశేషమే. సూపర్ స్టార్ కృష్ణ కూడా మంచు ఫ్యామిలీకి ఇప్పటికే మద్దతు ఇచ్చారు.