Motkupalli Narasimhulu: తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్, బీజేపీలోని అసంతృప్త నేతలకు కాంగ్రెస్ ‘హస్తం’ అందిస్తోంది. గాంధీ భవన్ తలుపులు బార్లా తెరిచి వచ్చే అటువైపు చూసేవారందరినీ సాదరంగా ఆహ్వానిస్తోంది. దీంతో ఇప్పటికు ఆ రెండు పార్టీల్లోని అసంతృప్త నేతలు చాలా మంది కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ చేయి పట్టుకుని నడిచేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పిలుపు వచ్చింది. అధికార బీఆర్‌ఎస్ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిపోతుండడంతో బీఆర్‌ఎస్ తెలంగాణలో పట్టు కోల్పోత్తున్నట్లు కనిపిస్తోంది.
నేడు హస్తం తీర్థం…
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమరిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గురువారం సాయంత్రం కాంగ్రెస్‌లో చేరారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం బీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఖర్గే సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆకుల లలిత, ఏనుగు రవీందర్‌రెడ్డి, శాసన మండలి మాజీ ఉపాధ్యక్షుడు నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, కరీంనగర్ బీర్‌ఎస్ నేత సంతోష్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు.
కేసీఆర్ తీరుపై తీవ్ర అసంతృప్తి..
శుక్రవారం కాంగ్రెస్‌లో చేరనున్న కీలక నేతల్లో దిలీప్ కుమార్ మినహా మిగతా వారంతా బీఆర్‌ఎస్ నేతలే. కాంగ్రెస్‌లో ఉన్న వీరందరినీ కేసీఆర్ తన బలం పెంచుకునేందుకు బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. టికెట్ ఆశ పెట్టారు. తీరా ఎన్నికల సమయంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో అసంతృప్తితో ఉన్న నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమంగ్రా తెలంగాణ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ మోత్కుపల్లి నర్సింహులు బీఆర్‌ఎస్‌లో ఉండగానే తన అసంతృప్త స్వరాన్ని పెంచారు. తనకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో అధినేత కేసీఆర్ పై గుర్రుగా ఉన్న మోత్కుపల్లిం.. ఆయన దగ్గరే తన పంచాయతీ తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంతో డెడ్‌లైన్ పెడుతూ.. ఓ వీడియోను చేరవేశారు. ‘నన్ను ఎందుకు పార్టీలో చేర్చకున్నారు? ఎందుకు పక్కన పెట్టారు?. ఆరు సార్లు శాసన సభకు ప్రాతినిధ్యం వహించిన నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు?’ ఆ వీడియోలో ప్రశ్నలు సంధించారు.
రాజకీయ ప్రస్తానం ఇలా..
మోత్కుపల్లి రాజకీయ ప్రస్థానం పరిశీలిస్తే టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మోత్కుపల్లి ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడి నుంచి మళ్లీ టీడీపీకి వచ్చారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొన్నాళ్లు టీడీపీలోనే కొనసాగారు. తర్వాత టీడీపీ ప్రాభవం తగ్గిపోవడం, బీజేపీ బలం పుంజుకోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ కూడా ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించింది.
హుజూరాబాద్ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్‌లోకి..
బీఆర్‌ఎస్‌లో బలమైన నేతగా ఎదిగిన ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసి బయటకు పంపిన తర్వాత ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. బీజేపీలో చేరి ఉప ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో ఈటలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చారు. ఈ సమయంలో బీజేపీలో దళిత నేతగా ఉన్న మోత్కుపల్లికి కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దళితబంధుకు బ్రాండ్ అంబాజిడర్ చేస్తానని చెప్పడంతో మోత్కుపల్లి వెంటనే బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మోత్కుపల్లి సేవలను వినియోగించుకుంటామని చెప్పడంతో ఎమ్మెల్యేగా ఎక్కడా సర్దుబాటు చేయకపోతే ఎమ్మెల్సీ పదవైన దక్కుతుందని ఆశించారు. యాదాద్రి ఆలయ ప్రారంభత్సోవం సందర్భంగానూ తన పక్కనే ఉంచుకున్నారు గులాబీ బాస్. దీంతో తనకు మంచి ప్రాధాన్యం ఇస్తున్నారని భావించారు. కానీ కేసీఆర్ మార్కు రాజకీయం మోత్కుపల్లికి ఆలస్యంగా అర్థమైంది. తుంగతుర్తి లేదా ఆలేరు టికెట్ ఆశించారు. కానీ కేసీఆర్ సిట్టింగులకే టికెట్ ఇచ్చారు. రెండ నెలలుగా అసంతృప్తితో ఉన్న మోత్కుపల్లి చివరకు కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు.