Onion Price: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు పెద్దలు.. అంటే వంటింట్లో ఉల్లికి అంతటి ప్రాధాన్యత ఉంది. ఉల్లిగడ్డ లేకుండా రోజు గడవదంటే అతిశయోక్తి కాదు. అయితే ఉల్లి మళ్లీ ఘాటెకుక్కతోంది. ధర రికార్డుస్థాయిలో పెరుగుతోంది. మొన్నటి వరకు టమాటా ధరలతో ఇబ్బంది పడిన పేద, మధ్య తగరతి ప్రజలను ఇప్పుడు ఉల్లి కన్నీళ్లు పెట్టించే పరిస్థితి నెలకొంది. నెల క్రితం వరకు వందకు 5–6 కిలోలు అమ్మగా, ఇప్పుడు కిలో రూ.60–రూ.70 పలుకుతోంది. ఇది రైతుబజార్ ధర మాత్రమే రిలైట్ మార్కెట్‌లో మరో రూ.10 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో కోయకుండానే ఉల్లి ధరలు సామాన్యులచే కంటతడి పెట్టిస్తున్నాయి.
భారీ వర్షాల ఎఫెక్ట్..
దేశంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలే. ఆరు నెలల క్రితం ఉల్లిరైతులు మహారాష్ట్రలో మద్దతు ధర కోసం ఉద్యమించారు. భారీ ర్యాలీ నిర్వహించారు. ధర భారీగా పతనం కావడంతో ఆందోళన చేశారు. కానీ ప్రస్తుతం ఉల్లిరైతు మోములో ఆనందం వెల్లివిరుస్తోంది. కానీ సామాన్యుడి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్రలో ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో ఉల్లి పంటలు దెబ్బతిని దిగుబడి గణనీయంగా తగ్గింది. ఫలితంగా బహిరంగ మార్కెట్‌లో వాటికి కొరత ఏర్పడింది. దాని కారణంగా ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ..
తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర, తెలంగాణలోని కర్నూల్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, మెదక్, చేవెళ్లలో ఉల్లి పంట ఎక్కువగా సాగుచేస్తారు. అయితే నీటి వసతి పెరగడంతో ఇక్కడి రైతులు కూడా ఉల్లిసాగును తగ్గించారు. వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఉల్లి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. నిత్యం 80 నుంచి 100 లారీల ఉల్లి ఉత్పత్తి కావాల్సి ఉండగా, ప్రస్తుతం కేవలం 20 లారీలు మాత్రమే ఉత్పత్తి అవుతోంది.
మార్కెట్‌కు తగ్గిన సరఫరా..
దిగుబడి పడిపోవడంతో మార్కెట్‌కు వచ్చే ఉల్లి బాగా తగ్గింది. పక్షం రోజులుగా నిల్వ ఉంచిన ఉల్లిపాయలనే విక్రయించిన వ్యాపారులు, మార్కెట్‌కు సరఫరా నిలిచిపోవడంతో ఉన్న నిల్వలను బ్లాక్ చేశారు. ధర పెంచి విక్రయిస్తున్నారు. మరోవైపు ఈ పెరుగుదల మరో పక్షం రోజుల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నవంబర్‌లో ఖరీఫ్ పంట అందుబాటులోకి..
నవబర్ రెండో వారం వరకు ఉల్లి ధర పెరుగుతూనే ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కిలో ధర రూ.100 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. నవంబర్ రెండో వారంలో కొత్త పంట చేతికి వచ్చే అవకాశం ఉండడంతో అప్పటి నుంచి ధరలు కాస్త తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు పేద, మధ్య తరగతిపై భారం తప్పదని అంటున్నారు.