IND Vs NZ Final Match: టీమిండియా వరుసగా రెండవసారి టి20 వరల్డ్ కప్ గెలిచింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వదేశంలో టి20 వరల్డ్ కప్ సొంతం చేసుకున్న జట్టుగా.. వరుసగా రెండవసారి పొట్టి ప్రపంచ కప్ అందుకున్న జట్టుగా.. ఓవరాల్ గా మూడవసారి టి20 వరల్డ్ కప్ సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది.
Also Read: జస్ ప్రీత్ బుమ్రా టీమిండియా వజ్రాయుధం.. బంతి పడితే వికెటే!
కొంతమంది భారత వ్యతిరేకులు.. పాకిస్థానీయులు, బంగ్లాదేశీయులు అంటున్నట్టుగా సూర్య కుమార్ యాదవ్ సేన గెలిచింది అడ్డి మారి గుడ్డి దెబ్బతో కాదు. ఫైనల్ మ్యాచ్లో ప్రతి సందర్భంలోనూ అద్భుతాలు జరిగాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ సూపర్ ఫామ్ లోకి వచ్చేసాడు. ఈ టోర్నీలో అతడు వరుసగా విఫలమవుతూ వచ్చాడు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం మెరుపు హాఫ్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఆ వైడ్ బాల్ ను గనుక అతడు టచ్ చేయకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా టీమిండియా 300 పరుగులు చేసేది.
ఇక సంజు మరోసారి తన మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసి .. న్యూజిలాండ్ బౌలర్ల మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఇషాన్ కిషన్ కూడా హాఫ్ సెంచరీ చేశాడు. అతడు ఉన్నంత సేపు మెరుపులు మెరిపించాడు. అభిషేక్, సంజు, ఇషాన్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కడంతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా 300 లోడ్ అనుకుంటున్న క్రమంలో.. న్యూజిలాండ్ బౌలర్ నీశం ఒకే ఓవర్ లో మూడు వికెట్లు తీయడంతో.. టీమిండియా ఒత్తిడికి గురైంది. సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీలు చేయడం.. చివర్లో శివం దుబే అదరగొట్టడంతో.. టీమిండియా భారీ స్కోర్ చేసింది.
టీమిండియా భారీ స్కోరు చేసిన నేపథ్యంలో చేజింగ్ సమయంలో న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతుందని అందరూ అనుకున్నారు. సెమి ఫైనల్ లో ఇంగ్లాండ్ మాదిరిగానే ఎదురుదాడికి దిగుతుందని భావించారు. కానీ, సూర్య కుమార్ యాదవ్ అత్యంత తెలివిగా బౌలింగ్ దళాన్ని న్యూజిలాండ్ మీదికి ప్రయోగించాడు. వరుణ్ చక్రవర్తి ధారాళంగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో.. తెలివిగా అక్షర్ పటేల్, బుమ్రా ను ప్రయోగించాడు. వీరిద్దరూ న్యూజిలాండ్ జట్టు టాప్ ఆర్డర్ మొత్తాన్ని కకావికలం చేశారు. న్యూజిలాండ్ లో ప్రమాదకరమైన ఓపెనర్ అలెన్ ను ఔట్ చేసిన తర్వాత.. ఆ జట్టను ఏ దశలో కూడా కోలుకొని ఇవ్వలేదు. ముఖ్యంగా ఇషాన్ కిషన్.. తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ లు పట్టడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు.
అహ్మదాబాద్ మైదానం టీమిండియా కు ఏ మాత్రం యోగ్యమైనది కాదు. మొన్నటి వరకు ఇదే ప్రచారంలో ఉండేది. ఇప్పుడు టీమ్ ఇండియా విజయం సాధించిన తర్వాత అహ్మదాబాద్ మైదానం గురించి మరొక రకమైన చర్చ సాగుతోంది. అహ్మదాబాద్ లో టీమిండియా జెండా పాతడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీమ్ ఇండియాకు తిరుగులేదని.. అహ్మదాబాద్ మైదానం కూడా విక్టరీ పరేడ్ గా మారిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.