Parliament Session 2024: తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలు కులాల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తుంటే.. దేశంలో జాతీయ పార్టీలు మతాల మంటల్లో చలి కాచుకుంటూ ఎదిగే ప్రయత్నం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఓటర్లు చీలిపోతున్నారు. తెలంగాణలో బీసీలు, రెడ్లు, వెలమ అంటూ రాజకీయాలు సాగుతున్నాయి. ఇక దేశంలో మాత్రం హిందూ, నాన్ హిందూ అనే రాజకీయం జరుగుతోంది. పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం(జూన్1న) చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గొప్ప నేతలందరూ హింస గురించి మాట్లాడారు, కానీ ఇప్పుడు హిందువులని చెప్పుకునేవారు హింస, ద్వేషం, అబద్దాల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ పెద్దలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. హింసను ధర్మంతో కలిపి మాట్లాడడం సరికాదని, దీనికి రాహుల్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ వర్సెస్ రాహుల్..
ఇక లోక్‌సభ చర్చలో భాగంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మధ్య మతాల యుద్దం జరిగింది. హిందూ సమాజాన్ని హింసావాదులతో పోల్చడాన్ని మోదీ తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. మోదీ, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ మాత్రమే హిందూ సమాజం కాదని మోదీ వ్యాఖ్యలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు.
భూములు లాక్కొని ఆలయాల నిర్మాణం..
ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల భూములను బలవంతంగా లాక్కొని ఆలయాలు, విమానాశ్రయాలు నిర్మించిందని రాహుల్ ఆరోపించారు. సామాన్యులను ఇబ్బంది పెట్టి అయోధ్య ప్రారంభానికి కార్పొరేట్ పెద్దలకు మాత్రమే ఆహ్వానాలు అందించిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. అయోధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు, భవనాలు తొలగించి వారిని రోడ్డున పడేసిందని ఆరోపించారు. అయోధ్యలో అద్భుతమైన రామమందిరం నిర్మించామని గొప్పలు చెప్పుకున్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో ఎదురుదెబ్బ తగలడమే బీజేపీ హింసకు నిదర్శనమని రాహుల్ వాదించారు.
మతాల మద్దతు కోసం..
ఇలా లోక్‌సభలో మోదీ, రాహుల్ మధ్య జరిగిన చర్చను పరిశీలిస్తే.. ఒకరు హిందూ మతం మద్దతు కోరుకుంటే.. మరొకరు నాన్ హిందువుల మద్దతు కోసం ప్రయత్నించారు. సైస్స్, టెక్నాలజీ ఎంత పెరిగినా రాజకీయాలు మాత్రం కులాలు, మతాల చుట్టూనే తిరుగుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా నినాదంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మోదీ.. ఓట్ల విషయంలో మాత్రం మతం ప్రస్తావన లేకుండా రాజకీయం చేయలేని పరిస్థితి. ఇదే సమయంలో నాన్ హిందూ కోసం రాహుల్ మాట్లాడకుండా ఉండలేరు. కులం చూసి మనిషిని.. మతం చూసి మానవత్వాన్ని నిర్దేశించేలా భారత రాజకీయాలు మారుతున్నాయి.