
MLA Undavalli Sridevi : వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి జనసేనలో చేరుతున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీచేయనున్నారా? తనను అవమానించిన ఏపీ సీఎం జగన్ పై బదులు తీర్చుకోవాలంటే అదే సరైన నిర్ణయమన్న భావనకు వచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు నిజం చేకూరుస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆమె ఏపీకి రావాలంటే భయం వేస్తోందని.. తనకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి నుంచి ప్రాణహాని ఉందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దళిత మహిళా ఎమ్మెల్యేను అయినందునే తనను అవమానిస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి స్వేచ్ఛగా పనిచేస్తానని.. అమరావతి రైతు టెంట్ లో కూర్చొంటాను అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో ఎమ్మెల్యే శ్రీదేవి కామెంట్స్ ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
గత ఎన్నికల్లో అనూహ్యంగా..
హైదరాబాద్ లో డాక్టర్ గా ఉన్న శ్రీదేవి 2019లో తాడికొండ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైమ్ ఎన్నికయ్యారు. ఆమె సీఎం జగన్ సతీమణి భారతికి స్నేహితురాలు. ఆ కోటాలో ఆమె టిక్కెట్ దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆమెపై లేనిపోని ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయంటూ సాకుగాచూపి టీడీపీ నుంచి వచ్చిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఆయనకు అన్నివిధాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకే టిక్కెట్ అన్న ప్రచారం ఉంది, ఈ తరుణంలో ఎమ్మెల్యే శ్రీదేవి తీవ్ర అసహనానికి గురయ్యారు. ఎమ్మెల్యే కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ పోలింగ్ నకు ముందు రోజే సీఎం జగన్ ను కలిశారు. కానీ ఎటువంటి భరోసా దక్కలేదు. దీంతో ఆమె పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారని వైసీపీ నాయకత్వం ఆరోపిస్తోంది. పార్టీ నుంచి బహిష్కరణ వేటు వేసింది.
ఆ కారణంగానే బ్యాక్ స్టెప్…
శ్రీదేవి తొలుత తెలుగుదేశం పార్టీలో చేరుతారు అని అంతా అనుకున్నారు. కానీ ఆమె చూపు జనసేన మీద పడింది అని అంటున్నారు. ఉండవల్లి శ్రీదేవికి పోటీగా టీడీపీలో చాలా మంది నాయకులు ఉన్నారు. దాంతో ఆమెకు అక్కడ టికెట్ దక్కే చాన్స్ పెద్దగా లేదని అంటున్నారు. అందువల్ల ఆమె వ్యూహం మార్చారని తెలుస్తోంది.జనసేనలో చేరితే పొత్తులలో భాగంగా ఆ సీటుని దక్కించుకుని గెలుచుకోవచ్చు అని భావిస్తున్నారు. జై అమరావతి అని స్లోగన్ అందుకున్నారు కాబట్టి అమరావతి రైతుల మద్దతు దక్కుతుదని దళిత ఓట్లు ఎటూ ఉన్నాయని లెక్క వేసుకుంటున్నారు. ఇక ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. తాడికొండలో కాపుల ఓట్లు పదిహేను వేల దాకా ఉన్నాయి. గత ఎన్నికల్లో పది వేల ఓట్లకు పైగా కాపుల ఓట్లు వైసీపీకి పడ్డాయి. అదే టైం లో జనసేన కూడా అక్కడ అయిదు వేల దాకా ఓట్లు తెచ్చుకుంది.
ఈ లెక్కలు చూసుకొని ఆమె మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది.
అన్ని లెక్కలు వేసుకునే..
ఎట్టి పరిస్థితుల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవాలని శ్రీదేవి భావిస్తున్నారు. టీడీపీ అయితే వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజం అవుతాయని.. తాను అమ్ముడుపోయినట్టు ఒప్పుకున్నట్టు అవుతుందని.. అందుకే జనసేన వైపు చూస్తున్నట్టు సమాచారం. ఇపుడు చూస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. దాంతో ఆ పార్టీలో చేరితే అన్ని విధాలుగా కరెక్ట్ డెసిషన్ అవుతుందని అలాగే తాను అనుకున్నట్లుగా రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి వైసీపీకి ప్రత్యేకించి జగన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చూస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీదేవి జనసేనలో చేరికపై త్వరలో క్లారిటీ వచ్చే చాన్స్ ఉంది.