
MLA Sridevi Audio Leak : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి కాకుండా.. తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేశారన్న నెపంతో బహిష్కరణకు గురయ్యారు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఆ పార్టీ క్యాడర్. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఆడియోను శ్రీ రెడ్డి లీక్ చేయగా, అది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో ఎమ్మేల్యే ఏమన్నారు..? ఎవరితో మాట్లాడారు ఒకసారి చూసేద్దాం.
ఇసుక తరలిస్తూ దొరికిన వాహనాలు..
తుళ్లూరు ప్రాంతంలో అక్రమంగా ఇసుక, మట్టిని తరలిస్తూ పలు వాహనాలు పోలీసులకు చిక్కాయి. ఆయా వాహనాలను విడిపించాలంటూ తుళ్లూరు సిఐ కు ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్ చేశారు. ఆయా వాహనాలను విడిపించాలని చెప్పినప్పటికీ సిఐ వాటిని విడిపించకపోవడంతో ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. సిఐకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చిన ఆమె.. ఎమ్మెల్యే మాట కూడా పట్టించుకోవా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో సిఐతో మాట్లాడిన ఆడియో క్లిప్ తాజాగా ఆమె పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతోంది.
తీవ్ర స్థాయిలో సీఐకు హెచ్చరికలు..
ఇసుక తరలిస్తూ పట్టుబడిన వాహనాలను విడిచి పెట్టాలని తుళ్లూరు సిఐను ఎమ్మెల్యే కోరారు. అలాగే విడిచిపెడతామని చెప్పి సీఐ వాటిని విడిచిపెట్టకపోవడంతో ఎమ్మెల్యే ఆయనకు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య కొద్దిసేపు ఫోన్ సంభాషణ జరిగింది. తాజాగా ఈ సంభాషణ ఆడియో బయటికి రావడంతో వైరల్ అవుతోంది. ఆడియోలో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఏమున్నాయి అంటే.. ‘వెంటనే వాటిని వదిలిపెట్టమని చెప్పానా లేదా. అవి పట్టుకున్నప్పుడు నేను నీకు ఫోన్ చేశానా లేదా.
వదలడానికి నీకు కష్టం ఏంటి’ అంటూ సీఐని ఎమ్మెల్యే గట్టిగా ప్రశ్నించారు. ‘అంతా నీ ఇష్టమేనా. నువ్వు చెప్పేది ఏంటి. అర్థం కావడం లేదా. ఏం మాట్లాడుతున్నావ్.
నువ్వేం చెప్పావ్ నువ్వేం చేస్తున్నావ్’ అంటూ సీఐపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐ చెప్పిన మాటలను ఆమె ఏ మాత్రం వినకుండా సీఐకు హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం రెస్పెక్ట్ లేదా నీకు
ఈసారి కు వదిలేసి నెక్స్ట్ పట్టుకోమని చెప్పానా’ అని మరోసారి హెచ్చరించే ప్రయత్నం చేశారు. అందర్నీ వదిలి పెట్టావు నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావ్ అంటూ మరోసారి సిఐడి ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సిఐ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ. ‘నాన్సెన్స్ నువ్వు వదులుతావా లేదా చెప్పు. జిల్లా ఎస్పీతో ఫోన్ చేయించుకుంటా. ఏం తమాషాగా ఉందా. ఎమ్మెల్యేని పట్టుకుని కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నవ్’ అంటూ సీఐపై మండిపడ్డారు.
కాళ్లు పట్టుకొని పోస్టింగ్ తీసుకున్నావ్..
ఈ సందర్భంగా సిఐపై తీవ్రంగా స్పందించిన ఆమె అనేక విషయాలను బయటపెట్టారు. తుళ్లూరు సిఐగా రావడానికి తన కాళ్లు పట్టుకున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘కాళ్లు పట్టుకుని పోస్ట్ తీసుకున్నావ్. అది గుర్తుపెట్టుకో’ అంటూ మరోసారి సిఐను హెచ్చరించే ప్రయత్నం చేశారు. ‘నువ్వు పంపిస్తావా లేదా. నువ్వేంటి నీ పోస్ట్ ఏంటి.. ఏమనుకుంటున్నావు.
ఎక్స్ట్రాలు చేయొద్దు వాళ్లను పంపించు. లేదంటే డిజిపికి, ఎస్పీకి కాల్ చేస్తా’ అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
సిఐ మాటలు పట్టించుకోని ఎమ్మెల్యే..
ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన సీఐ.. ‘ఇది ఎస్సై గారు పట్టుకొచ్చారు మేడం. ఇప్పుడు అవి వదిలితే మిగతా బళ్ళు వదలడం కష్టమవుతుంది మేడం’ అని చెప్పినప్పటికీ ఎమ్మెల్యే వినకుండా వాదించారు. ఇప్పుడు వదిలి మరోసారి పట్టుకోవాలి అని ఎమ్మెల్యే చెప్పినప్పుడు.. ‘నెక్స్ట్ పట్టుకోలే మేడం. వాళ్ళు వచ్చి ప్రశ్నిస్తారు కదా’ అని సిఐ చెప్పిన సమాధానం పై ఆమె మండిపడ్డారు. ‘ మట్టి, ఇసుక గవర్నమెంట్ పాలసీ కదా మేడం’ అని సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే వినలేదు. ‘మీరు చెప్పినట్లు చేస్తాను మేడం. కాకపోతే ఇవన్నీ దొంగ బళ్ళు కాదా మేడం. మీకు బ్యాడ్ నేమ్ వస్తుంది మేడం’ అని సీఐ చెప్పినప్పటికీ వినకుండా డిజిపికి, ఎస్పీకి ఫోన్ చేస్తానంటూ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశారు.