Janasena Pawan Kalyan: గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండుచోట్ల పోటీచేశారు. కానీ రెండింటాఓటమే ఎదురైంది. విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి పోటీచేసినా నిరాశే ఎదురైంది. అయితే అది అధికార పక్షానికి అస్త్రంగా మారింది. తాను పోటీచేసిన స్థానమే గెలవలలేని వాడు.. పార్టీని ఏం గెలిపిస్తాడంటూ అధికార పార్టీ మంత్రుల నుంచి కిందిస్థాయి నేతల వరకూ హేళన చేస్తున్నారు. గత మూడున్నరేళ్లుగా చేస్తూనే ఉన్నారు. అయితే ఇవి జన సైనికులకు మింగుడుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లోపార్టీ గెలుపుకంటే పవన్ గెలుపునే ఒక మిషన్ గా తీసుకుంటున్నాయి. పవన్ ఎక్కడ పోటీచేసినా అక్కడ గెలుపునకు ఇప్పటి నుంచి జనసేన నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని గంటాపధంగా చెబుతున్నారు.

ప్రస్తుతం పవన్ సినిమాల్లో కూడా బిజీగా ఉన్నారు. చాలా సినిమాలకు కమిట్ అయ్యారు. వాటన్నింటినీ పూర్తిచేసి రాజకీయాలపై ఫోకస్ పెంచాలని భావిస్తున్నారు.అయితే గడిచిన ఎన్నికలకు ముందు కూడా పవన్ ఇక తాను సినిమాలు చేయనని ప్రకటించారు. ఎన్నికల అనంతరం సినిమాలు చేయడం మొదలు పెట్టారు. అది తన బతుకుతెరువు అనిచెప్పుకొచ్చారు. పార్టీ బాధ్యతలను నాదేండ్ల మనోహర్ కు అప్పగించి సినిమాలు చేస్తున్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని ప్రచారం నేపథ్యంలో తిరిగి యాక్టివ్ అయ్యారు. పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచారు. అయితే ముందస్తు పరిస్తితులు ఏవీ కనిపించకపోవడంతో పెండింగ్ సినిమాలు పూర్తిచేసే పనిలో పడ్డారు. అటు పార్టీ కార్యక్రమాలు, ఇటు సినిమాల షూటింగ్ లతో పవన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.
పవన్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. ఇది జనసేన శ్రేణుల అభిప్రాయమే కాదు. రాష్ట్రంలో మెజార్టీ వర్గాలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. గత మూడున్నరేళ్లుగా ప్రభుత్వ దుందుడుకు చర్యలు గమనించే వారు పవన్ అసెంబ్లీలో ఉండుంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. కానీ దురదృష్టవశాత్తూ గత ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. అయితే ప్రజలు పవన్ కళ్యాణ్ కు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.
అయితే పవన్ తనకు సినిమాలు బతుకుతెరువు అని చెప్పడం సహేతుకమే..అయినా నిత్యం ప్రజల్లో ఉండకపోతే సీరియస్ నెస్ పోతుంది. గత ఎన్నికల కంటే ఏపీలో ఓటు షేరింగ్ ను పవన్ గణనీయంగా పెంచుకున్నారు. ఈ పరిస్థితుల్లో అయితే సీరియస్ గా దృష్టిసారించగలిగితే వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలే వస్తాయి. అయితే పవన్ పోటీచేసే నియోజకవర్గం విషయంలో స్పష్టతనివ్వాలని జన సైనికులు కోరుతున్నారు. అప్పుడే తమ మిషన్ ను ప్రారంభిస్తామంటున్నారు. పవన్ పోటీచేసే నియోజకవర్గంపై సీఎం జగన్ ఫోకస్ అదేస్థాయిలో పెట్టనున్నందున ముందస్తుగా క్లారిటీ ఇస్తే గట్టి పోరాటమే చేస్తామని జన సైనికులు హైకమాండ్ కు విన్నవిస్తున్నారు.