Minister Roja: రోజాకు అవమానం : టాలీవుడ్ వదిలేసింది.. కానీ కోలీవుడ్ ఖండించింది..

ఖుష్బూ బిజెపి నాయకురాలు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కూడా. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు నీతి బాహ్యంగా ఉన్నాయని.. తమ ఇంట్లో సైతం మహిళలు ఉన్నారన్న విషయం గుర్తుంచుకొని మాట్లాడాలని ఖుష్బూ కోరారు.

Written By: Dharma, Updated On : October 7, 2023 9:39 am

Minister Roja

Follow us on

Minister Roja: మంత్రి రోజాకు అనూహ్యంగా తమిళ సినిమా పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఆమెపై తెలుగుదేశం పార్టీ నేత బండారు సత్యనారాయణమూర్తి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నందమూరి, నారా కుటుంబాలపై రోజా కామెంట్స్ పై బండారు సత్యనారాయణమూర్తి స్పందించారు. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలకు దిగారు.బ్లూ ఫిల్ముల్లో నటించావని.. నీ సంగతి ఎవరికి తెలియదంటూ కామెంట్స్ చేశారు. తమ వద్ద వీడియోలు సైతం ఉన్నాయని.. వాటిని బయట పెట్టమంటావా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అటు తర్వాత బండారు సత్యనారాయణమూర్తి అరెస్ట్ కావడం, విడుదల కావడం జరిగిపోయింది. అయితే ఈ ఘటనపై తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించలేదు. కనీసం రోజాను పలకరించలేదు. ఇటువంటి తరుణంలో తమిళ సినీ పరిశ్రమ నుంచి సీనియర్ హీరోయిన్లు రాధిక, ఖుష్బూలు స్పందించడం విశేషం. తెలుగు పరిశ్రమ విస్మరించినా.. తమిళ పరిశ్రమ స్పందించడం రోజాకు ఉపశమనం కలిగించే విషయం.

ఇందులో ఖుష్బూ బిజెపి నాయకురాలు. జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కూడా. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలు నీతి బాహ్యంగా ఉన్నాయని.. తమ ఇంట్లో సైతం మహిళలు ఉన్నారన్న విషయం గుర్తుంచుకొని మాట్లాడాలని ఖుష్బూ కోరారు. సినిమా నటులపై అటువంటి ముద్ర వేయడం దారుణ చర్యగా అభివర్ణించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాధిక సైతం రోజాకు మద్దతు తెలిపారు. సినీ రంగానికి అతి దగ్గరగా ఉండే తెలుగుదేశం పార్టీలోని నాయకులు ఈ విధంగా వ్యాఖ్యానించడం దారుణమని అభివర్ణించారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు.

కరవమంటే కప్ప కోపం.. విడవమంటే పాముకి కోపం అన్న చందంగా తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి మారింది.ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ రెండు రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది. పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. తెలుగుదేశం, వైసీపీలో రాజకీయ నేపథ్యంలో నాయకులు కొనసాగుతున్నారు. ఇటువంటి తరుణంలో రాజకీయ విమర్శలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు సర్వసాధారణం. ఈ తరుణంలోనే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినిమారంగానికి చెందిన ప్రముఖులు ఈ వివాదాల్లో చిక్కుకుంటున్నారు.ఇటువంటి వివాదాలపై మాట్లాడేందుకు సినీ పరిశ్రమలో ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు.స్పందిస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని భావించి ఎక్కువ మంది మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

గతంలో చాలా రకాల ఘటనలు జరిగాయి.పవన్ కళ్యాణ్ పై పోసాని వ్యాఖ్యలు, చిరంజీవి కుటుంబం పై అనుచిత వ్యాఖ్యల సమయంలో సైతం ఎవరు మాట్లాడలేదు. మొన్నటికి మొన్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్ ను టార్గెట్ చేసుకుని వైసిపి నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో సైతం ఇది తప్పు అని ఖండించినవారు లేకపోయారు.ఇప్పుడు తాజాగా రోజా విషయంలో సైతం అదే ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో తమిళ సినీ పరిశ్రమకు చెందిన నటీమణులు ముందుకు వచ్చి సంఘీభావం తెలపడం మంచి పరిణామమే. అయితే ఇది ఒక్క రోజా విషయంలోనే కాకుండా ఇతర సినీ రంగానికి చెందిన వ్యక్తుల విషయంలో కూడా.. ఈ మద్దతు కొనసాగించాల్సిన అవసరం ఉంది.