
Minister Niranjan Reddy- Chandrababu: నలబై ఏళ్ల రాజకీయ నేపథ్యం.. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు, ఒకసారి విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం.. హైటెక్ ముఖ్యమంత్రిగా కీర్తి.. సాఫ్ట్‌వేర్ కంపెనీలను తెలుగు రాష్ట్రాలకు తెచ్చినాన్న డాబు.. ఇంతటి నేతకు తనకు చరిత్ర తెలియదన్న చిన్న లాజిక్ మర్చిపోయాడు. వయోభారమో లేక.. తెలంగాణను కించపర్చాలన్న భావనో తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. చరిత్ర తెలియని నాయకుడు.. సీఎం ఎలా అయ్యాడురా ‘బాబు’… తెలంగాణకు కూడా ఇదేం కర్మ అని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మండి పడుతున్నారు.
అన్నం పరిచయం చేశామన్న బాబు..
క్రెడిట్ కోసం పాకులాడడం చంద్రబాబుకు బాగా అలవాటు. ప్రతీదీ తన ఖాతాలో వేసుకోవాలని తాపత్రయపడుతూ ఇప్పటికే పలుమార్లు ‘తప్పు’లో కాలేశాడు. తాజాగా ‘తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రూ.2 కిలో బియ్యం ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం అలవాటయింది’ అని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలపై యావత్ తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చరిత్ర ఇసుమంతైనా తెలియని నేత చంద్రబాబు అని మండిపడుతున్నారు. తెలంగాణపై ఆయనకున్న అవగాహన రాహిత్యానికి నిదర్శనమని, మూర్ఖపు అహంకారానికీ పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాబును చెడుగుడు ఆడిన నిరంజన్‌రెడ్డి..
వివక్షపూరితంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. బాబును ఓ ఆటాడుకున్నారు. చరిత్ర తెలియని బాబు తెలంగాణ సమాజం దృష్టిలో చరిత్ర హీనుడయ్యాడని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడొద్దని హెచ్చరించారు.
11వ శతాబ్దంలోనే వరిసాగు..
తెలంగాణ ప్రాంతంలో 11వ శతాబ్దంలో నాటికే కాకతీయులు గొలుసు కట్టు చెరువులు నిర్మించారని తెలిపారు. ఈ చెరువుల కింద తెలంగాణ ప్రజలు వరి, గోధుమలు, కొర్రలు, జొన్నలు, పెసలు, ఉల్లి, అల్లం, వెల్లుల్లి సాగుచేశారని వివరించారు. ఈ చరిత్ర తెలుసుకోవాలని, తెలియకపోతే చదవాలని బాబుకు సూచించారు.
ప్రపంచానికి వాటర్‌షెడ్ పరిజ్ఞానం అందించాం..
ప్రపంచానికి తొలి వాటర్ షెడ్ పరిజ్ఞానాన్ని అందించిన నేల తెలంగాణ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. అప్పట్లోనే విష్ణు కుండినుల నుంచి కాకతీయులు, ఆ తదుపరి నిజాంల వరకు తెలంగాణను పాలించినవారంతా వ్యవసాయాభివృద్ధికి బాటలు వేశారన్నారు. అప్పుడే తెలంగాణ ప్రాంతంలోని ఎత్తు పల్లాల నేలపై వర్షపు నీటిని ఒడిసిపట్టి వేల ఎకరాలను సాగుచేశారని తెలిపారు. గొలుసు కట్టు చెరువులు తెలంగాణలో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డాయని చెప్పారు.

15వ శతాబ్దంలోనే హైదరాబాద్ దమ్ బిర్యానీ..
వరన్నమే తెలియదన్న చంద్రబాబు 15వ శతాబ్దంలోనే హైదరాబాద్ దమ్ బిర్యానీకి ప్రసిద్ధి చెందిన విషయం తెలుసుకోవాలని సూచించారు. నాడే హైదరాబాద్ బిర్యానీని విదేశీయయులు ఇష్టపడేవారని గుర్తుచేవారు. బిర్యానీ, షేర్వానీ, ఖుర్బానీ అని కేసీఆర్ ఉద్యమంలో అనేక సార్లు ప్రస్తావించారని గుర్తుచేశారు.
1956 విలీనంతోనే వినాశనం..
నిజాం పాలన వరకు తెలంగాణ సస్యశ్యామలమైందని, 1956లో జరిగిన బలవంతపు విలీనంతోనే తెలంగాణ వినాశనానికి బీజం పడిందని తెలిపారు. ఆంధ్రా పాలకులు తెలంగాణపై వివక్ష చూపుతూ కుంటలు, చెరువులు ధ్వంసం చేశారన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో వివక్ష చూపారని ఆరోపించారు. దశాబ్దాలపాటు ప్రాజెక్టుల నిర్మాణం సాగదీశారన్నారు. అప్పుడు కట్టిన ఒక్క ప్రాజెక్టు కూడా నిర్ణీత లక్ష్యం మేరకు సాగునీరందించలేదని తెలిపారు. ప్రాజెక్టులు కడుతున్నట్లు, సాగునీరు ఇస్తున్నట్లు మాత్రమే ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంత ప్రజలను మభ్యపెట్టారన్నారు. విలీనానికి ముందు వైభవంగా ఉన్న తెలంగాణ ప్రజల జీవితాలను సమైక్య పాలకులు చెల్లాచెదురు చేశారని ఆరోపించారు. వివక్ష పూరితమైన పాలనలో గ్రామాల్లో ఉపాధి కరువై తెలంగాణ ప్రజలు బొంబాయి, దుబాయి బాట పట్టారని తెలిపారు. ఆఖరుకు రూ.2కు కిలోబియ్యం కోసం తమ ఓటు హక్కును వినియోగించుకునే దుస్థితికి తెలంగాణ ప్రజలను తీసుకువచ్చారని వివరించారు. తెలంగాణపై ఆంధ్రా పాలకుల అక్కసు, అక్రోశం, విద్వేషం, వివక్ష, అన్యాయాలు తెలంగాణ ఉద్యమానికి పునాది అయ్యాయని తెలిపారు.
రాయల సీమ చరిత్ర తెలుసా..
తెలంగాణపై బాబు చేసిన వ్యాఖ్యలు పూర్తిగా వివక్ష పూర్తిమైనవని నిరంజన్‌రెడ్డి ఖండించారు. ఇలాంటి నేత మాజీ ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. చరిత్రను చూస్తే.. రాయలసీమ ప్రజలకే బియ్యం తెలియదన్నారు. ఆ చరిత్ర కూడా తెలుసుకోవాలని సూచించారు.
‘‘జొన్నకలి, జొన్నయంబలి
జొన్నన్నము, జొన్నపిసరు, జొన్నలె తప్పన్
సన్నన్నము సున్న సుమీ
పన్నుగ పల్నాటి సీమ ప్రజలందఱకున్ ’’
అని మహాకవి శ్రీనాథుడు (1365 – 1441) ఆరు శతాబ్దాల క్రితమే ఆంధ్ర ప్రాంత ఆహారం గురించి రాశారని వివరించారు.
తెలంగాణలో మళ్లీ రాజకీయం చేస్తానంటున్న బాబు ఇలాంటి వివక్ష పూరిత, ఆధిపత్య, అహంకారంతో కూడిన వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. బాబు వ్యాఖ్యలను తెలంగాణ సమాజం మొత్తం తప్పు పడుతోంది.