CM Jagan YCP Campaign : ఇంటింటా.. ఊరువాడా.. ఎక్కడ చూసినా వైసీపీ రంగులే కనిపించాలి.. సీఎం జగన్ ఫొటోనే పెట్టుకోవాలి గత మూడేళ్లుగా సర్కారు నిర్వాకం ఇది, చివరికి శ్మశానవాటికలను సైతం వదల్లేదు. బడులు, గుడులు, ప్రభుత్వ భవనాలు, చివరకు వాటర్ ట్యాంకర్లను సైతం వైసీపీ రంగులతో నింపేశారు. చివరకు విద్యుత్ స్తంభాలను సైతం విడిచిపెట్టలేదు. కాలనీ ఆర్చ్ లపై సైతం రంగులు అద్దుతున్నారు. ఆ కాలనీకి భూములిచ్చిన వారి పేర్లను చెరిపి మరీ రంగులు వేస్తున్నారు. ఇదేమని అడిగితే దండనకు దిగుతున్నారు. వాదిస్తే కేసులు పెడుతున్నారు. ఈ క్రమంలో చిర్రెత్తుకొచ్చే వారు కోర్టును ఆశ్రయిస్తున్నారు. కానీ కోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తూ రంగులు, ఫొటోల పిచ్చిని అధికార పార్టీ నేతలు పరాకాష్టకు చేర్చుతున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వ భవనాలు, కట్టడాల వరకూ చేరిన ఈ పిచ్చి.. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులపై కూడా చూపారు. తెనాలిలో ఇటువంటి దృశ్యమే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇప్పడది సోషల్ మీడియాలో వైరల్ గామారింది. పిచ్చి ఉండొచ్చు కానీ.. మరీ ఇంతలా అంటూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అయితే తాము ఏం చేసినా లోక కళ్యాణం కోసమేనన్నట్టు వ్యవహరించడం వైసీపీ శ్రేణులకు అలవాటైన విద్య. ప్రభుత్వ చర్యలను తమ చిటికలుతో సమర్థించే నేర్పరితనం ఒక్క అధికార పార్టీ మందీ మగధులకే సాధ్యం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి.. ఆయన భార్య లక్ష్మీపార్వతితో శభాష్ అని ప్రకటించుకుని సమర్థించుకోవడం చూస్తుంటే ఏమనాలి. మొన్నటికి మొన్న విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ఓపీ రశీదుపై కూడా జగన్ ఫొటోను ముద్రించి తమ ముద్రను చాటుకున్నారు. చివరకు భూ సర్వే ప్రక్రియలో వినియోగిస్తున్న సర్వే రాళ్లపై సైతం వైసీపీ రంగులు అద్దుతున్నారు. సీఎం జగన్ ఫొటోను జతపరుస్తున్నారు. వాటిని వినియోగించాలని స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు.
గతంలో ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు ఏ రంగు వేయాలన్న దానిపై నిర్థిష్ట ప్రమాణాలు పాటించారు. ఇప్పుడు మాత్రం ఆ ప్రమాణికాన్ని వదిలేశారు. వైసీపీ మూడు రంగులనే ప్రమాణికంగా తీసుకున్నారు. నలుగురు సొమ్ముతో నిర్మించే సముదాయాలను సైతం అవే రంగులు. చివరకు అంతిమ సంస్కారాలు జరిపే శ్మశానవాటికలను వదల్లేదు. గతంలో సీఎం ఫొటొలు ఎక్కడ ఉండాలి? ఏయే కార్యాలయాల్లో ఉండాలి? అనేది ఒక ప్రమాణికం ఉండేది. కొన్ని సంప్రదాయాలు పాటించేవారు. జగన్ వచ్చాక ఆ పరిధి దాటిపోయింది. సీఎం అయిన వెంటనే ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడం మొదలెట్టారు. కోర్టులు వారించినా ప్రచార కోరిక మానలేదు. ఇక సీఎం ఫొటోలైతే ఎక్కడా చూసినా కనిపించాల్సిందే. సచివాలయంలో సెక్షన్లు, కాన్ఫరెన్స్ హాళ్ల నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పోలీసు స్టేషన్‌లతో పాటు ఆఫీసుల ప్రహరీ వరకు సీఎం ఫొటోలు అతికిస్తున్నారు. ఇక ప్రభుత్వ ప్రకటనల్లో గతంలో ఆంధ్రప్రదేశ్‌లోగో, సీఎం, మంత్రుల ఫొటోలతో పాటు లబ్ధిదారుల ఫొటోలు ఉండేవి. వైసీపీ సర్కారు కొత్త ట్రెండ్ ను తీసుకొచ్చింది. ఏ ప్రకటన అయినా, ఎంత పెద్దదయినా ఒక్క జగన్ ఫొటోనే ఉండాలి. మంత్రులు కాదు కదా… అశాఖ ఉన్నతాధికారుల ఫొటో సైతం ముద్రించడానికి వీలు లేకుండా ఆదేశాలిచ్చారు.
తాజా తెనాలిలో కనిపించిన దృశ్యం విషయానికి వద్దాం. మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో సీఎం జగన్ పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రైతుభరోసా ఖాతాలో వేసుకొని ప్రచారం చేసుకుంటున్న సంగతి తెలిసిందే,. రేపు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ జమ చేసేందుకుగాను జగన్ తెనాలి వచ్చి మీట నొక్కనున్నారు. పనిలోపనిగా రైతుల ఇన్ పుట్ సబ్సిడీని కూడా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. అయితే జగన్ అభిమతాన్ని గుర్తించిన స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా మొక్కజొన్న కంకెలకు వైసీపీ రంగులు వేసి సిద్ధం చేశారు. వాటిని జగన్ కు చూపెట్టి మంచి మార్కులే కొట్టేయ్యాలని భావిస్తున్నారు. అయితే రంగులంటే మహా ఇష్టపడే జగన్ తప్పకుండా వారిని అభినందిస్తారు. తన చిరునవ్వుతో ఆశీర్వదిస్తారు. అయితే ఈ వైసీపీ రంగులతో కూడిన మొక్కజొన్న కంకెలను చూస్తున్న వారు మాత్రం… ఓరి నీ దుంపతెగ మొక్కజొన్న కంకెలను వదలవా జగన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.