Minister Dharmana Prasada: మూడు రాజధానులకు మద్దతు విషయంలో వైసీపీ స్పీడు పెంచింది. అమరావతికి మద్దతుగా రైతులు చేపడుతున్న పాదయాత్ర ఉత్తరాంధ్రలో అడుగుపెడుతున్న నేపథ్యంలో మరింత దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటివరకూ మూడు రాజధానులకు మద్దతుగా సీరియస్ ప్రయత్నం చేస్తున్నా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. విశాఖలో క్యాపిటల్ రాజధానిగా చేస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించినా ఉత్తరాంధ్ర ప్రజలు పెద్దగా స్పందించలేదు. ఒక్క వైసీపీ నేతలు తప్ప మిగతావారెవరూ దీనిపై ఎటువంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే టీడీపీ అమరావతి ఏకైక రాజధానికి బాహటంగా మద్దతు తెలుపుతుండగా జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు సంఘీభావం తెలిపాయి. దీంతో ఏ రాజకీయ పక్షమూ తమతో కలిసిరాదన్న నిర్ణయానికి వచ్చిన వైసీపీ.. ఇప్పుడు నాన్ పొలిటికల్ జేఏసీ ఏర్పాటుచేసే పనిలో ఉంది. ఉత్తరాంధ్రలో వరుసగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కొన్నిచోట్ల సమావేశాలు నిర్వహించినా ప్రజలు పట్టించుకోలేదు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో అసహనం వ్యక్తమవుతుండగా…దీనిపై ఉత్తరాంధ్ర మంత్రులకు జగన్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

అయితే ఈ విషయంలో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు గళం విప్పారు. మూడు రాజధానులకు మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ అనుమతిస్తే మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి అడుగుపెడతానని చెప్పారు. లక్షలాది మంది ప్రజలు తన వెంట కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మంత్రి ధర్మాన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో విశాఖను వెతుక్కుంటూ రాజధాని వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు కేంద్రం నియమించిన కమిటీలు అదే విషయాన్నిచెప్పాయని గుర్తుచేశారు. కానీ నాడు చంద్రబాబు తెలివిగా వ్యవహరించి రాజకీయం చేశారని విమర్శించారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిందని.. ఉత్తరాంధ్రకు ఇదో వరంగా భావించాలన్నారు. క్యాపిటల్ రాజధాని వస్తే ఉత్తరాంధ్ర ఎంతగానో అభివృద్ధి చెందుతుందన్నారు. బిడ్డల భవిష్యత్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు కలిసి రావాలని కూడా అభ్యర్థించారు. 130 ఏళ్ల తరువాత విశాఖకు రాజధాని అవకాశం వస్తే చంద్రబాబు అడ్డుకోవడం దారుణమన్నారు.
అమరావతి నుంచి పాదయాత్రగా వస్తున్నారని.. ఈ ప్రాంతంలో రాజధాని వద్దు, అభివృద్ధి చేయవద్దంటూ చెబితే ఊరుకునేది ఎలా అని ప్రశ్నించారు. వారిని నిలదీయ్యండని పరోక్షంగా ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఇప్పుడివి ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారాయి. మంత్రుల నుంచి వైసీపీ దిగువ శ్రేణి నాయకుల వరకూ ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశమమైతే కనిపిస్తోంది. అదే సమయంలో ఆదివారం పాలనా వికేంద్రీకరణపై శ్రీకాకుళంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఇందులో వైసీపీ నేతలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొనున్నారు. ధర్మాన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో అమరావతి రైతుల పాదయాత్రపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికైతే ఇన్నాళ్లు ప్రజల నుంచి స్పందన లేదని గమనించిన వైసీపీ ప్రభుత్వం తేనె తుట్టను కదిలించే బాధ్యతను ధర్మానకు అప్పగించిందన్న మాట.

అయితే మంత్రివర్గ విస్తరణతో పదవి దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు చాలారోజులు సైలెంట్ గా ఉన్నారు. గతంలోలాగా ఏమంత యాక్టివ్ గా పనిచేయడం లేదు. జగన్ కూడా తప్పనిసరి అయి ఆయనకు మంత్రి పదవి ఇచ్చినట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రకటన చర్చనీయాంశమైంది. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉంటే సీఎం జగన్ అనుమతి ఎందుకని.. స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి దిగితే ఉత్తరాంధ్ర ప్రజలు సీరియస్ గా ఆలోచించే అవకాశం ఉండేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన వెంట లక్షలాది మంది జనం వస్తారని ధర్మాన చెప్పడం ద్వారా మరో రకమైన కామెంట్స్ వినిపిస్తోంది. అటు వైసీపీకి మద్దతుగా రాజీనామా అంటూనే వ్యక్తిగత చరిష్మ పెంచుకోవడానికే ధర్మాన ఉద్యమ గోదాలోకి దిగడానికి ప్రయత్నిస్తున్నారని విపక్షాలు కామెంట్స్ చేస్తున్నాయి. ఏది ఏమైనాఇన్నాళ్లూ మౌనంగా ఉన్న ధర్మాన ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది.