KCR BRS-AP: భారతీయ రాష్ట్ర సమితిని దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు. అందుకు తగ్గ ప్రణాళిక ముందుగానే వేసుకున్నారు. అయితే తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీ విషయంలో మాత్రం ఇంతవరకూ ఎటువంటి స్పష్టత లేదు. ఇక్కడ తనకు మిత్రుడైన జగన్ అధికారంలో ఉన్నారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇప్పటివరకూ మిత్రుడిగా కొనసాగినా మున్ముందు మాత్రం శత్రువుగా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. అయితే ఏపీ విషయంలో కేసీఆర్ వద్ద వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల తరువాతే ఏపీలో బీఆర్ఎస్ బలోపేతమయ్యే అవకాశముందని భావిస్తున్నట్టు సమాచారం. ఆ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీలో ఏది ఓడినా రాజకీయంగా అందిపుచ్చుకోవాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ప్రధానంగా రెండు కుటుంబాలు తన వెంట వస్తాయని అంచనా వేస్తున్నట్టు సమాచారం. అదే కానీజరిగితే ఏపీలో పట్టు సాధించడం ఏమంత కష్టం కాదని కేసీఆర్ భావిస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి తరువాత ఏపీపై కేసీఆర్ దృష్టిపెట్టనున్నారు. విజయవాడ, గుంటూరులో భారీ బహిరంగ సభలు గ్రాండ్ గా నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అటు తరువాత చిన్నాచితకా నాయకులను బీఆర్ఎస్ లోకి ఆహ్వానించనున్నారు. వారి ద్వారానే సభ్యత్వ నమోదులు, కార్యవర్గాలు ఏర్పాటుచేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా పురుడుపోసుకున్న పార్టీ కనుక వామపక్షాలు తన వెంట నడుస్తాయని భావిస్తున్నారు. వారి పరిస్థితి కూడా ఏపీలో బాగాలేనందును తప్పకుండా తన దారికి వస్తాయని నమ్మకంగా ఉన్నారు. వారితోనే వచ్చే ఎన్నికల్లో ఎలాగోలా నెట్టుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. కానీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా లేకున్నా.. ఉనికిని చాటుకునేప్రయత్నం మాత్రం చేస్తున్నారు.
అయితే ఎన్నికల అనంతరం కేసీఆర్ మాత్రం తన స్ట్రాటజీని మార్చనున్నారు. ప్రధానంగా బీసీ నినాదాన్ని తెరపైకి తెచ్చి బీఆర్ఎస్ lను బలోపేతం చేయనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ హోరాహోరీగా తలపడనున్నాయి. ఏపీలో బిగ్ ఫైట్ జరగనుంది. టీడీపీ, జనసేన కలిస్తే మాత్రం వైసీపీకి కష్టమే. టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీచేస్తే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి లాభిస్తుంది. ఒక వేళ వైసీపీ ఓడిపోతే మాత్రం ఆ పార్టీలో అసంతృప్తి పెల్లుబికే అవకాశముంది. జగన్ పార్టీలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన తండ్రి వైఎస్సార్ కు సమకాలికులే. కానీ నాడు వైఎస్ఆర్ దగ్గర ఉన్నంత స్వేచ్ఛ జగన్ వద్ద లేదు. పేరుకే అధికార పార్టీ కానీ నిధులు లేవు. పవర్స్ అంతకంటే లేవు. దీంతో వారంత అసంతృప్తితో ఉన్నారు. పొరపాటున వైసీపీ ఓటమి చవిచూస్తే మాత్రం వారంతా బీఆర్ఎస్ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ బీసీ కార్డు, కులం కార్డు ప్రయోగిస్తున్న నేపథ్యంలో ముందుగా బీఆర్ఎస్ వైపు వచ్చేది మాత్రం ధర్మాన ప్రసాదరావు కుటుంబమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధర్మాన వెలమ సామాజికవర్గానికి చెందిన నేత. బలమైన బీసీ నాయకుడు. కేసీఆర్ ఇప్పటికే ఆయన చెవిలో ఒక మాట వేశారని.. వైసీపీ ఓడిపోతే అక్కడి నుంచి అసంతృప్త నేతలను తెప్పించే బాధ్యత అప్పగించారని సమాచారం.

ఒక వేళ టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. చంద్రబాబుకు వయసు పైబడుతుండడం, వరుసగా రెండు సార్లు ఓటమితో పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోతాయి. నాయకులు పక్కచూపులు చూస్తారు. ఆ సమయంలో బీఆర్ఎస్ వారికి ప్రత్యామ్నాయమవుతుంది. ప్రస్తుతం టీడీపీలో కింజరాపు కుటుంబం యాక్టివ్ రోల్ పాత్ర పోషిస్తోంది. పార్టీ అధ్యక్షుడిగా ఎర్రన్నాయుడు సోదరుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఎంపీగా కుమారుడు రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేగా కుమార్తె భవానీ ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో సైతం వీరు గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. వీరికి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించాని కేసీఆర్ చూస్తున్నారు. అచ్చెన్నాయుడు బీసీ నేత. పైగా వెలమ సామాజికవర్గం వారు. వీరికి బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగిస్తే ఏపీలో పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉంది. అంటే ఎన్నికల తరువాత ఏపీలో కేసీఆర్ పాలిట్రిక్స్ ఉపయోగించే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఆ రెండు కుటుంబాల ద్వారా బీఆర్ఎస్ ను ఏపీలో ప్రబలమైన శక్తిగా మార్చాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.