Homeజాతీయ వార్తలుఇప్పుడు అందరి కళ్ల ఆయనపైనే.. ఒక్కసారిగా సీఎం క్యాండిడేట్‌ అయ్యారు..!

ఇప్పుడు అందరి కళ్ల ఆయనపైనే.. ఒక్కసారిగా సీఎం క్యాండిడేట్‌ అయ్యారు..!

Sreedharan
దేశంలో మొట్టమొదటి మెట్రో రైలు రూపకర్త శ్రీధరన్‌. విజయవంతంగా పలు నగరాల్లో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభం అవడానికి కారకుడు ఆయన. ఇప్పుడు అందరి కళ్లు మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాపైనే పడ్డాయి. దానికి కారణం ఆయన్ను బీజేపీ తమ సీఎం కేండిడేట్‌గా ప్రకటించడమే. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా శ్రీధరన్‌ను ప్రకటించారు. ఈ మేరకు కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ వెల్లడించారు. మెట్రో శ్రీధరన్ ఇటీవలే తన 88వ ఏట బీజేపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమని శ్రీధరన్‌ ప్రకటించారు. ఆ తర్వాత ఆయనే తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థి అన్న ప్రకటన వెలువడింది.

Also Read: యుద్ధం నుంచి.. ఉద్భ‌వించిన‌ మహిళా దినోత్సవం..!

జూన్ 12, 1932లో కరుకపుతుర్ (ప్రస్తుతం కేరళ, పాలక్కాడ్ జిల్లా)లో శ్రీధరన్‌ జన్మించారు. మాజీ ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్, శ్రీధరన్ లు క్లాస్ మేట్స్. పాలక్కాడ్ హైస్కూలులో కలిసి చదువుకున్నారు. ఏపీలోని కాకినాడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసారు శ్రీధరన్‌. మొదట కోజికోడ్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజిలో లెక్చరర్‌గా పనిచేసారు. బాంబే పోర్ట్ ట్రస్ట్‌లో ఒక సంవత్సరం అప్రెంటిస్‌గా చేసారు. 1953లో ఐఆర్ఎస్ఇకి ఎంపికయ్యారు. 1954 డిసెంబర్‌లో దక్షిణ రైల్వేలో ప్రొబేషనరీ అసిస్టెంట్ ఇంజనీర్‌గా నియమితులయ్యారు. 1964 డిసెంబరులో తుఫాను కారణంగా కొట్టుకు పోయిన రామేశ్వరం వంతెనను 46 రోజుల్లో పునరుద్ధరించడం ద్వారా శ్రీధరన్ పలువురు దృష్టిని ఆకర్షించారు. అందుకుగాను రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక పురస్కారాన్ని పొందారాయన.

1970లో కోల్ కత్తా మెట్రో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్‌గా బాధ్యతలు నిర్వహించారు శ్రీధరన్‌. కోల్‌కత్తా మెట్రో ప్రాజెక్టును విజయవంతంగా పూర్తిచేసారు. 1975లో ఆపదవికి రాజీనామా చేసిన శ్రీధరన్‌, అక్టోబర్ 1979లో కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో చేరారు. కొచ్చిన్ షిప్‌యార్డ్‌ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సిఎండి)గా బాధ్యతలు నిర్వర్తించారు. 1981లో శ్రీధరన్‌ నేతృత్వంలో ఎంవి రాణి పద్మిని ఓడ ప్రారంభమైంది. కొచ్చిన్ షిప్‌యార్డ్‌ ఉత్పత్తి చేసిన మొదటి ఓడ ఎంవి రాణి పద్మిని. జూలై 1987లో వెస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పదోన్నతి పొందిన శ్రీధరన్‌. జూలై 1989లో ఇంజనీరింగ్ సభ్యుల సంఘం, రైల్వే బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టారు. భారత ప్రభుత్వ మాజీ అఫీషియో కార్యదర్శి పదవిని శ్రీధరన్‌ చేపట్టారు. జూన్ 1990లో అన్ని విధుల నుంచి తప్పుకున్నారు.

1990లో కొంకణ్ రైల్వే విభాగం సీఎండీగా శ్రీధరన్‌ నియామితులయ్యారు. అప్పటి రైల్వే మంత్రి జార్జి ఫెర్నాండెజ్ చొరవక కారణంగా శ్రీధరన్‌కు ఆ పదవి దక్కింది. భారతదేశంలో బీఓటీ (బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్) ప్రాతిపదికన చేపట్టిన మొదటి పెద్ద ప్రాజెక్ట్ కొంకణ్ రైల్వే కావడం విశేషం. కొంకణ్ రైల్వే ప్రాజెక్టుకు అత్యంత కష్టతరమైన రైల్వే ప్రాజెక్టుగా పేరుంది. మొత్తం ప్రాజెక్టు 760 కిలోమీటర్లు కాగా 150కి పైగా వంతెనలు నిర్మించారు. 82 కిలో మీటర్ల పొడవు, 93 సొరంగాలు, మృదువైన నేల ద్వారా సొరంగ మార్గాలు.. ఇలా ఈ రైల్వే ప్రాజెక్టు హైలైట్స్ ఎన్నో వున్నాయి. కొంకణ్ రైల్వే ప్రాజెక్టు పూర్తిచేసి మంచి పేరు పొందారు శ్రీధరన్‌. ఆ తర్వాత తన కెరీర్‌లో అత్యంత కీలకమైన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా శ్రీధరన్‌ బాధ్యతలు చేపట్టారు.

Also Read: చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావ్.. చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని నిప్పులు

శ్రీధరన్‌‌ను అప్పటి ఢిల్లీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ నియమించారు. ఢిల్లీ మెట్రో రైలును అనుకున్న తేదీ కంటే ముందుగానే పట్టాలెక్కించిన ఘనత శ్రీధరన్‌కు దక్కింది. ఈ ప్రాజెక్టు విజయంతో మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రశంసలు అందుకున్నారాయన. 2005 చివరి నాటికి పదవీ విరమణ చేస్తానని ప్రకటించగా.. రెండో దశ ఢిల్లీ మెట్రో బాధ్యతలను కూడా ఆయనకే అప్పగిస్తూ.. పదవీ విరమణ గడువును పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. ఆ విధంగా ఢిల్లీ మెట్రోలో శ్రీధరన్ 16 సంవత్సరాలు సర్వీసు అందించారు. డిసెంబర్ 31, 2011న పదవీ విరమణ చేసిన శ్రీధరన్‌.. ఆ తర్వాత తన సొంత రాష్ట్రం కేరళలోనే ఉంటున్నారు.

1964లో రైల్వే మంత్రి ద్వారా తొలి పురస్కారాన్ని పొందిన శ్రీధరన్.. 2001లో పద్మశ్రీ పురస్కారం కూడా పొందారు. 2002లో టైమ్స్ ఆఫ్ ఇండియా మ్యాన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. 2002లో ఓం ప్రకాష్ భాసిన్ అవార్డు పొందారు. 2002-03లో సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) మౌలిక సదుపాయాల అభివృద్ధిలో నాయకత్వానికి జూరర్స్ అవార్డు గెలుచుకున్నారు. 2003లో పబ్లిక్ సర్వీస్ ఎక్సలెన్స్ కొరకు ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ పురస్కారం దక్కింది. ఢిల్లీ ఐఐటి నుండి డాక్టర్ ఆఫ్ సైన్స్ (హోనోరిస్ కాసా) డిగ్రీ పొందారు. డా.వై.నాయుడమ్మ స్మారక పురస్కారాన్ని దక్కించుకున్నారు. 2005లో చండీఘర్‌లోని శిరోమణి ఇన్‌స్టిట్యూట్ నుండి భరత్ శిరోమణి పురస్కారాన్ని పొందారు. 2005 ఫ్రాన్స్ ప్రభుత్వం చేవాలియర్ డిలా లెజియన్ డి హోన్నూర్ (నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్) పొందారు. 2007లో నేషనల్ స్టేట్స్ మాన్ ఫర్ క్వాలిటీ ఇన్ ఇండియాగా నిలిచిన శ్రీధరన్‌కు 2008లో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. రాజస్థాన్ టెక్నికల్ యూనివర్శిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లిట్రేచర్ పొందారు. 2009లో రూర్కీ ఐఐటి నుండి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ అందుకున్నారు. 2012లో మనోరమ న్యూస్ చేత న్యూస్ మేకర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందారు. 2013లో జపాన్ ప్రభుత్వ ఆర్డర్ ఆఫ్ రైజింగ్ సన్, గోల్డ్ అండ్ సిల్వర్ అవార్డులు పొందారాయన. 2017 కేపీపీ నంబియార్ అవార్డును పొందారు శ్రీధరన్.

తాజాగా.. బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన మెట్రో మ్యాన్ శ్రీధరన్‌ను కేరళలో ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ఉత్సాహంతో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వ సర్వీసుల్లో పని చేసి.. తన అంకిత భావాన్ని, సాంకేతిక పరిఙ్ఞానాన్ని చాటుకున్న శ్రీధరన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా తమ అభిమతం రాజకీయాలు కావని, అభివృద్ధికి బాటలు వేయమేనని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ సర్వీసులో విజయవంతమైన శ్రీధరన్ రాజకీయాల్లో కూడా రాణిస్తారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే.. 88 ఏళ్ళ ముదిమి వయసులో ఆయన ముఖ్యమంత్రిగా చురుకుగా వుండగలరా అన్నదిపుడు కేరళ ప్రజల్లో నానుతున్న ప్రశ్న. అయితే.. ఎల్డీఎఫ్ లేదా యూడీఎఫ్ ఇలా.. ఒకరు కాకపోతే మరొకరు అధికారాన్ని పంచుకునే కేరళలో మూడో పక్షంగా బీజేపీ ఏ మేరకు మెరుగైన ఫలితాలు సాధించగలదో వేచి చూడాలి.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular