Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మృదుస్వభావి. చాలా నెమ్మదస్తుడు కూడా. తనపై విమర్శలు చేసినవారిని సైతం క్షమించగల గొప్ప మనసున్న మనిషి. ఎంత ఎత్తుకు ఎదిగనా ఒదిగి ఉండే స్వభావం ఆయనది. అయితే ఆయన గతానికి విభిన్నంగా స్పందించాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది ఒక వైరల్ అంశంగా మారిపోయింది.
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో ఒక రకమైన వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం అంటే ఒక రకమైన భయం కనిపించింది. అటు ప్రభుత్వం సైతం సినీ పరిశ్రమతో ఒక ఆట ఆడుకుంది. పవన్ పై ఉన్న కోపంతో పరిశ్రమను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసింది. ఇటువంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి పెద్దన్న పాత్ర పోషించారు. తనకున్న స్టార్ డంను మరిచి సినీ పరిశ్రమ కోసం పలుమార్లు ఏపీ సీఎం జగన్ ను చిరంజీవి కలిశారు.తనకు అవమానాలు ఎదురైనా.. తెలుగు సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం చిరంజీవి నడుం బిగించారు. ఈ క్రమంలో తాను కొంత తగ్గి ప్రయత్నించారు. దీనిపై మెగా అభిమానులు బాధపడ్డారు. గత కొంతకాలంగా చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన పని తాను చేసుకుంటున్నారు.
ఈ తరుణంలో చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.వాల్తేరు వీరయ్య 200 రోజుల ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమపై పడ్డారంటూ వైసీపీ సర్కార్పై కామెంట్స్ చేశారు. ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలని వైసీపీ సర్కార్కు సూచించారు. ప్రస్తుత ఈ కామెంట్స్ పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు,ఉద్యోగ, ఉపాధి పై దృష్టి పెట్టాలంటూ జగన్ సర్కార్కు సూచించారు. అప్పుడే ప్రజలు ఇష్టపడతారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తూనే తలవంచి నమస్కరిస్తారని మెగాస్టార్ తేల్చి చెప్పారు. దీంతో చిరంజీవి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి తోటి నటీనటులతో సీఎం జగన్ను కలిశారు. అప్పట్లో మెగాస్టార్ ను సీఎం జగన్ అవమానించారంటూ కామెంట్స్ వినిపించాయి. కానీ చిరంజీవి పట్టించుకోలేదు. తన మానాన తాను సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇటువంటి తరుణంలో వాల్తేరు వీరయ్య 200 రోజులు ఫంక్షన్ హాజరైన చిరు వైసీపీ సర్కారుపై షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.