Telangana Congress: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తెలంగాణ కాంగ్రెస్‌కు బూస్ట్ ఇచ్చింది. దీంతో ఇక తగ్గేదేలే అన్నట్లు నేతలు దూకుడు పెంచారు. ఏఐసీసీ కూడా ఇక నెక్ట్స్ టార్గెట్ తెలంగాణనే అని ప్రకటించింది. ఈమేరకు ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కూడా దూకుడు ప్రదర్శించారు. పొంగులేటి, జూపల్లి కృష్ణారావు చేరికకు కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా ఓ కారణమయ్యాయి. ఇక ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ కూడా విజయవంతమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ఊపు తెచ్చింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం టీ కాంగ్రెస్‌లో అంతా కామూష్ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్‌ను కడిగి పారేశారు. అవినీతిని ఎండగట్టారు. అభివృద్ధిని ఎలా అడ్డుకున్నారు. తెలంగాణను ఎలా నిర్లక్ష్యం చేశారు అని పూస గుచ్చినట్లు వివరించారు. కానీ, కాంగ్రెస్ వైపు నుంచి కనీసం ఖండన కూడా రాలేదు.
సీఎం విమర్శలను తిప్పికొట్టలేదు..
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలా అడ్డుకుంది.. తెలంగాణ బిడ్డల చావుకు ఎలా కారణమైంది. అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణ వాదాన్ని ఎలా అణచివేశారు అని కేసీఆర్ అసెంబ్లీలో ఎండగట్టారు. అయితే అసెంబ్లీలో సీఎల్పీనేత భట్టి కానీ, ఎమ్మెల్యేలు కానీ వీటిని ఖండించలేదు. అసెంబ్లీ బయట కూడా ఆ పార్టీ నేతలు సీఎం వ్యాఖ్యలను తప్పు పట్టలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. కాంగ్రెస్‌పై ఏదైన ఆ విమర్శలు చేస్తే వెంటనే కౌంటర్ ఇచ్చే రేవంత్‌రెడ్డి కూడా ఈసారి సైలెంట్‌గా ఉన్నారు. సీఎం ప్రసంగానికి ముందురోజు కేటీఆర్ వర్సెస్ శ్రీధర్‌బాబు అన్నట్లుగా సభ జరిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో సభ వేడెక్కింది. కానీ, పార్టీని తిట్టినప్పుడు మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు.
వ్యూహాత్మకం.. అంగీకారమా..
కాంగ్రెస్ సైలెంట్‌పై ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు బీజేపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు దూకుడు ప్రదర్శించిన కేసీఆర్, తాజాగా కాంగ్రెస్‌పై పడ్డారు. బీజేపీతో రాజీ కుదరడంతోనే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ నేతలు కేసీఆర్‌కు కౌంటర్ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కాంగ్రెస్ నేతల సైలెంట్ వ్యూహాత్మకమా.. లేక కేసీఆర్ చేసిన ఆరోపణలను అంగీకరించినట్లా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమవద్ద ఇంకా బెలెడు అస్త్రాలు ఉన్నాయన్న కేసీఆర్, కాంగ్రెస్ ఇటీవల ఇస్తున్న హామీలను కూడా విమర్శించారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులు ఎత్తేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తే అదే పరిస్థితి వస్తుందని ఆరోపించారు. దాదాపు కాంగ్రెస్ బట్టలు విప్పి బర్బాత్ చేసినంత పనిచేశారు కేసీఆర్ అయినా.. కాంగ్రెస్‌లో అంతా కామూష్.. దీంతో అసలు ఏం జరుగుతుందో అన్న చర్చ జరుగుతోంది. కేసీఆర్ ముందు నిలవలేక అన్నీ మూసుకు కూర్చున్నారా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటికు దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పటికే సైలెంట్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సైలెంట్ అయితే.. వచ్చే ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌కు తిరుగు ఉండదు.