ఒక వంక దేశంలో కరోనా వైరస్ కేసులు 422కు చేరుకొని, మృతుల సంఖ్య ఎనిమిది కాగా, పరిస్థితి తీవ్రతరమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతూ ఉండగా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చేపట్టిన లాక్ డౌన్ పట్ల కొందరు ప్రజలు నిర్లప్తితతో వ్యవహరిస్తూ ఉండడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు.
ఆదివారం నాడు అనూహ్యంగా దేశ ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొనగా, దేశ వ్యాప్తంగా 17 రాష్ట్రాలలోని 82 జిల్లాలతో పాటు పలు రాష్ట్రాలలో సహితం ఈ నెలాఖరు వరకు లోక్ డౌన్ ను విస్తరించడం తెలిసిందే. అయినా ప్రజలు ఇంకా వీధులలో తిరుగుతూ ఉండడం పట్ల ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు.
చాలా మంది ప్రజలు ఇప్పటికీ తీవ్రంగా పరిగణించడం లేదని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం ఆయన ఓ ట్వీట్‌లో ఈ విషయమై ప్రజలను మరింత అప్రమత్తం చేశారు. “దయచేసి మిమ్ములను మీరే కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి” అంటూ విజ్ఞప్తి చేశారు. వైద్యాధికారుల సూచనలను ఖచ్చితంగా పాటించమని సూచించారు.
ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మనకోసం మనందరి కోసం లాక్‌డౌన్‌ను పాటించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నియమ, నిబంధనలు తు.చ తప్పకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కాగా, బ్యాంకులు తమ ఖాతాదారులను ఆన్ లైన్ సేవలు వినియోగించుకోమని ప్రోత్సహిస్తున్నాయి. కేవలం ఎంపిక చేసిన ప్రదేశాలలో కొన్ని బ్రాంచ్ లను మాత్రమే తెరవాలని ఆలోచిస్తున్నాయి. ఈ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోమని రీజినల్ లేదా జోనల్ లేదా సర్కిల్ మేనేజర్ లకు ఈ విషయమే ఒక నిర్ణయం తీసుకొనే అధికారం ఇచ్చారు.
మరోవంక, ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోనూ మార్చి 31వతేదీ వరకు ఓలా, ఉబర్ క్యాబ్ లను బంద్ చేశామని ఆయా సంస్థలు ప్రకటించాయి. దేశ వ్యాప్తంగా ఢిల్లీ, బెంగుళూర్, ముంబై లతో సహా పలు నగరాలలో సెక్షన్ 144 క్రింద నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఐదుగురు వ్యక్తులకు మించి ఎక్కడా గుమికూడరాదు.