Delhi Liquor Scam: మాగుంటకు బెయిల్.. లిక్కర్ స్కాం నుంచి కవిత బయటపడినట్టేనా?

రాఘవకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇక జైల్లో ఉన్నది సుఖేశ్ చంద్రశేఖర్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. ఇప్పటికే వీరిని పలుమార్లు ఈడీ విచారించింది. వారు చెప్పిన వివరాల ఆధారంగా పలు అభియోగాలు మోపింది.

Written By: K.R, Updated On : July 19, 2023 3:33 pm

Delhi Liquor Scam

Follow us on

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ హైకోర్టు అతని భార్య ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున, మెడికల్ రికార్డులు పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది.. ఇక ఢిల్లీ లిక్కర్ స్కాంలో మిగిలింది ఆప్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్. మరి ఈ సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయి? కేంద్రం ఎటువంటి అడుగులు వేయనుంది? మొన్నటిదాకా హోరెత్తిన కవిత అరెస్ట్ ప్రచారం ఎందుకు చప్పబడిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించడం కష్టంగా మారింది. ఇదే సమయంలో కవిత లిక్కర్ స్కాం నుంచి బయటపడినట్టు వార్తలు వస్తున్నాయి. రేపో మాపో అరెస్ట్ అవుతారని వార్తల నుంచి ఆమె పేరు ప్రస్తావనకు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రాఘవకు ఉపశమనం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారడంతో రాఘవరెడ్డికి ఉపశమనం లభించింది. రాఘవకు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో ఇక ఈ కేసులో కీలకంగా ఉన్నది సుఖేష్ చంద్రశేఖర్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా. అయితే ఇటీవల సిసోడియా తన భార్యకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆమెను చూసేందుకు కోర్టు అనుమతితో బయటకు వచ్చాడు. తర్వాత కోర్టు ఆదేశాల మేరకు జైలుకు వెళ్లిపోయాడు. కానీ ఇక్కడ యాదృచ్ఛికంగా ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. గత ఫిబ్రవరి 10న కేంద్ర దర్యాప్తు సంస్థ ఇతడిని అరెస్టు చేసింది. సౌత్ గ్రూప్ ద్వారా ఇతడు పలు ఏరియాల్లో మద్యం వ్యాపారం నిర్వహించాడని ఈడీ అభియోగ పత్రాల్లో పేర్కొన్నది. అంతేకాదు ఈ కేసులో మాగుంట శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారకముందు రాఘవను ఈడీ పలుమార్లు విచారించింది. ఒకానొక దశలో రాఘవ అప్రూవర్ గా మారేందుకు ముందుకు వచ్చాడనే ప్రచారం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ రాఘవ స్థానంలో శరత్ చంద్రా రెడ్డి అప్రూ వర్ గా మారడంతో రాఘవకు ఉపశమనం లభించింది. అయితే రాఘవ సౌత్ గ్రూపులో కీలకపాత్ర పోషించాడని ఈడీ అప్పట్లో పలు అభియోగాలమోపింది. ఆప్ నేతలకు చేరిన 100 కోట్ల ముడుపుల్లో ఇతని ప్రమేయం ఉందని పేర్కొన్నది.. అయితే తాజాగా ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో దాన్ని రద్దు చేయాలని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

తర్వాత పరిస్థితి ఏంటి

రాఘవకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇక జైల్లో ఉన్నది సుఖేశ్ చంద్రశేఖర్, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. ఇప్పటికే వీరిని పలుమార్లు ఈడీ విచారించింది. వారు చెప్పిన వివరాల ఆధారంగా పలు అభియోగాలు మోపింది. అంతేకాదు వీరిద్దరూ జైల్లో ఉండగానే ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితను హైదరాబాదులో ఒకసారి, దేశ రాజధాని లో రెండుసార్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేశాయి. ఆ సందర్భంలో కవిత తన ఫోన్లను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందచేశారు. ఒకానొక దశలో ఈ కేసు కు సంబంధించి కవితను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. కవిత పేరు పెద్దగా చర్చలో లేకుండానే పోయింది. అయితే కవితను అరెస్టు చేయకుండా తెర వెనుక లోపాయికారీ ఒప్పందాలు జరిగాయని ఒక సెక్షన్ అభిప్రాయపడుతుండగా.. లేదు లేదు.. మొన్న మధ్యప్రదేశ్లో జరిగిన ఒక సభలో అవినీతికి సంబంధించి ఎవరినీ వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి మోడీ ప్రకటించిన నేపథ్యంలో.. కవిత అరెస్టు తప్పకుండా జరుగుతుందని మరో సెక్షన్ అభిప్రాయపడుతోంది. అంతే కాదు సుఖేష్ చంద్రశేఖర్ ఇచ్చిన ఆధారాల ప్రకారం మిగతా అరెస్టులు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. అయితే కీలక నిందితులకు బెయిల్ రావడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు నీరుగారి పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితికి, భారతీయ జనతా పార్టీకి మధ్య ఒప్పందం కుదిరినందు వల్లే కవిత అరెస్టు కావడం లేదని వాదనలకు తాజా సంఘటనలు బలం చేకూర్చుతున్నాయి.