
Madhya Pradesh: మనిషి తన మేథస్సు పెంచుకుంటున్నాడు. ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తున్నాడు. తన తెలివితో నీళ్లలో చేపలా ఈదటం నేర్చుకున్నాడు. ఆకాశంలో పక్షిలా ఎగరడం తెలుసుకున్నాడు. కానీ భూమిపై మాత్రం మనిషిలా బతకడం మరిచిపోయాడు. ఫలితంగా పశువులా ప్రవర్తిస్తూ తనలోని రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. శాస్ర్త సాంకేతికత ఎంతలా అభివృద్ధి సాధించినా మనిషిలోని రాక్షస గుణం మారడం లేదు. ఫలితంగా ఎదుటి మనిషిని చంపుతూ తనలో కూడా మరో రాక్షసుడు దాగి ఉన్నాడని చెప్పకనే చెబుతున్నాడు. దీనికి తాజా ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది.
మూఢ నమ్మకాల జాడ్యంతో బాధ పడుతున్న తరుణంలో కొందరు ఏవో పనికి రాని మాటలు నమ్ముతూ తమ భవిష్యత్ అంధకారం చేసుకుంటున్నారు. మూఢ నమ్మకాల ఊబిలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో తమ స్వార్థం కోసం ఎదుటి మనిషిని చంపుతూ చివరికి కటాకటాలపాలవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ర్టంలోని గ్వాలియర్ కు చెందిన బంటు బదౌరియా, మమత దంపతులు. వారికి 18 ఏళ్లుగా సంతానం కలగలేదు. దీంతో వారి స్నేహితుడి సూచన మేరకు ఓ భూత వైద్యుడిని కలిశారు. దీంతో అతడి సూచన మేరకు ఓ అఘాయిత్యానికి పాల్పడ్డారు.
తమకు సంతానం కలగాలనే ఆశతో నరబలి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే వేరే వాళ్లయితే సమస్య ఉంటుందని భావించి ఓ వేశ్యను ఎంచుకున్నారు. అయితే ఆమెను బలిచ్చి మృతదేహాన్ని తరలించే క్రమంలో కింద పడిపోగా భయపడి మరో వేశ్యను తీసుకొచ్చి ఆమెను సైతం చంపేశారు. దీంతో వారి కాల్ లిస్ట్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించి వారిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
ఎవరో చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మి రెండు జీవితాలను నాశనం చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. పిల్లల మాట దేవుడెరుగు కానీ ప్రస్తుతం మాత్రం వారికి జైలు శిక్ష ఖాయం. పిల్లలు పుడతారనే భ్రమలో ఎదుటి వారి ప్రాణాలు తీసేందుకు సిద్ధపడటం నిజంగా కసాయితనమే. మనిషిలోని రాక్షస గుణం ఇక్కడే కనిపిస్తుంది. నిర్దాక్షిణ్యంగా ఇద్దరి ప్రాణాలు తీయడంపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.