Rohini Acharya: మొన్నటిదాకా బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం జరుగుతున్నప్పుడు లాలు కుటుంబం ఒక్కతాటి మీద ఉంది.. బయటికి వెళ్లిపోయిన కొడుకు మినహా మిగతా వారంతా కూడా లాలు తో ఉన్నారు.వారంతా కూడా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించారు. ఎన్డీఏ కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తీరా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. బీహార్ ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత వాస్తవ పరిస్థితి ఏమిటో లాలు కుటుంబానికి అర్థమవుతోంది.
లాలు కుటుంబంలో బీహార్ ఎన్నికల ఓటమి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎన్నికల్లో లాలు ఇద్దరు కుమారులు పోటీ చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ అతి కష్టం మీద గెలిచాడు. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఓటమిపాలయ్యాడు.. వీరిద్దరు మాత్రమే కాదు ఆర్జెడిలో కీలక నాయకులు కూడా ఓడిపోయారు.. ఈ ఓటమి బాధ నుంచి ఇంకా లాలు కుటుంబం తేరుకోలేదు. ఇంతలోనే ఆ కుటుంబానికి గట్టి షాక్ తగిలింది.
బీహార్ ఎన్నికలలో అత్యంత దారుణమైన ఓటమి తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్య సంచలన ప్రకటన చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కుటుంబంతో బంధాన్ని కూడా తెంచుకుంటున్నట్టు వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆమె ప్రకటించారు.. ఆర్జేడి లో ఉన్న సంజయ్ యాదవ్, రమీజ్ తనను పార్టీ నుంచి వెళ్లిపోమని చెప్పారని.. అందువల్లే ఓడిపోయిన బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.
వాస్తవానికి లాలు కుటుంబంలో వివాదాలు నివురు గప్పిన నిప్పులాగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలలో ఓటమి తర్వాత బయటపడుతున్నాయి. అందువల్లే సంజయ్ యాదవ్, రమీజ్ రోహిణి తో వాగ్వాదానికి దిగారు. ఇది కాస్త తీవ్ర స్థాయి చేరుకోవడంతో రోహిణి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో బాధగా ఉందని.. ఓటమికి సంబంధించిన నింద మొత్తం తాను తీసుకుంటున్నట్టు ప్రకటించారు.
ఇకపై లాలు కుటుంబంతో తనకు ఎటువంటి సంబంధం లేదని రోహిణి ప్రకటించారు. రాజకీయాల నుంచి కూడా పూర్తిగా తప్పుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉంటుంది.. తర్వాత ఏం పని చేయాలనే దానిపై త్వరలోనే ప్రకటిస్తానని ఆమె వెల్లడించారు. అయితే గతంలో లాలు ప్రసాద్ యాదవ్ కిడ్నీ సమస్యతో బాధపడినప్పుడు.. రోహిణి ఒక కిడ్నీ దానం చేశారు.. అందువల్లే లాలు బతకగలిగారు. లాలుకు అత్యంత ఇష్టమైన కూతుర్లలో రోహిణి ఒకరు. రోహిణి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ లాలు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.