టీ కాంగ్రెస్ ను చీల్చే దిశగా కోమటిరెడ్డి?

పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్ లో కలతలు రేగాయి. సీనియర్లు కినుక వహించారు. పార్టీకి సేవలందించేది లేదని ప్రకటించారు. తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినా సముచిత స్థానం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ఎవరికి ఇచ్చినా కలిసే ఉంటామని చెప్పినా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంతో సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. […]

Written By: Srinivas, Updated On : June 28, 2021 12:12 pm
Follow us on

పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో కాంగ్రెస్ లో కలతలు రేగాయి. సీనియర్లు కినుక వహించారు. పార్టీకి సేవలందించేది లేదని ప్రకటించారు. తమను కాదని కొత్తగా వచ్చిన వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జెండాలు మోసినా సముచిత స్థానం దక్కలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మొదట ఎవరికి ఇచ్చినా కలిసే ఉంటామని చెప్పినా రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంతో సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు. పీసీసీ పదవి అమ్మకున్నారని ఆరోపిస్తున్నారు.

అసంతృప్తికి గురైన సీనియర్లను కలుస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీంతో ఎవరు కూడా ఆయనను కలిసేందుకు సిద్ధంగా లేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీడీపీ నుంచి వచ్చిన వారిని కలవనని తెగేసి చెబుతున్నారు. వెంకటరెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై కార్యకర్తలతో కలిసి నిర్ణయం తీసుకుంటున్నారు. సోమవారం నుంచి పాదయాత్ర చేస్తానని చెప్పారు. ఇబ్రహీంపట్నం నుంచి భువనగిరి వరకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పిదాలపై ప్రజలకు వివరించనున్నారు.

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. టీఆర్ఎస్, బీజేపీ లను ఎదుర్కొని పోటీలో నిలబడి తన సత్తా చాటాలని సూచించారు. దీంతో కోమటిరెడ్డి సైతం బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్థానంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వడంపై మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్ రెడ్డిపై సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

హనుమంతరావు, జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లాంటి సీనియర్లు ఇప్పటికే తమ గళం వినిపించారు. సీనియర్లకే పట్టం కట్టాలని సూచించినా అధిష్టానం లెక్కచేయలేదు. దీంతో వారందరు పార్టీకి ఏమేరకు సేవలందిస్తారో వేచి చూడాల్సిందే. ప్రస్తుతం పీసీసీలో రేవంత్ రెడ్డి ఒంటరై పోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీని గట్టెక్కించడం అంత తేలికైన విషయం కాదని తెలుస్తోంది.