AP 310 km coastline danger warning: సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఏపీ సొంతం. శ్రీకాకుళం జిల్లా( Srikakulam district ) డొంకూరు నుంచి తిరుపతి జిల్లా తడ వరకు తీర ప్రాంతం వెయ్యి కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దాదాపు 12 జిల్లాల్లో తీరం కొనసాగుతోంది. అయితే ఏడాది పొడవునా ఆటుపోట్లు, విపత్తులతో తీరం కోతకు గురవుతోంది. ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. విపత్కర పరిస్థితులకు తీరం కోతకు గురి కావడమే కారణమని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఏపీలో 12 జిల్లాల్లో తీర ప్రాంతం 31 శాతం కోతకు గురైనట్లు కేంద్రం చెబుతోంది. గడిచిన కొద్ది కాలంలోనే 44% తీరం కోత పెరిగినట్లు కూడా స్పష్టం చేసింది కేంద్రం. పార్లమెంటులో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అడిగిన ప్రశ్నకు అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లోక్సభలో సమాధానం చెప్పారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీలో ఓ 24 శాతం మాత్రమే తీరం సురక్షితం అని ప్రకటన చేయడం ఆందోళన కలిగిస్తోంది.
ఆశించిన స్థాయిలో ఫలితం లేక..
ఏపీలో సుదీర్ఘ సముద్రతీరం ఉండడం రాష్ట్రానికి ఒక వరం. అయితే ఈ తీరం ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూర్చడం లేదు. తీర ప్రాంతంలో సరైన నిర్మాణాలు జరగడం లేదు. ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు వంటివి నిర్మాణం ఆశించిన స్థాయిలో లేవు. దీనికి తోడు తీర ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో పాటు చెట్లు నరికివేత, ఆపై జల కాలుష్యంతో సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. ఈ క్రమంలోనే తీరం కోతకు గురవుతోంది. ఏటా తుఫాన్లతో పాటు విపత్తులతో తీరప్రాంతం అస్తవ్యస్తంగా మారుతోంది. దీనిపైనే కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
గ్రేట్ గ్రీన్ వాల్ నిర్మాణం..
ప్రస్తుతం ఏపీలో ఐదు కిలోమీటర్ల వెడల్పు, వెయ్యి కిలోమీటర్ల పొడవున గ్రేట్ గ్రీన్ వాల్( great green wall ) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా గోదావరి జిల్లాల్లో తీర ప్రాంతంలో ప్రయోగాత్మకంగా ఈ వాల్ నిర్మాణం సాగుతోంది. అది గాని సక్సెస్ అయితే రాష్ట్రంలో మొత్తం తీర ప్రాంతంలో ఈ గ్రీన్ వాల్ రానుంది. 2047 నాటికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ప్రత్యేక ప్రకటన చేశారు.
జిల్లాల వారీగా ఇది..
ఏపీలో 12 జిల్లాలు తీర ప్రాంతంలో ఉన్నాయి. తిరుపతి జిల్లాల్లో ఇప్పుడు ఉన్న తీర ప్రాంతంలో 22% కోతకు గురవుతోంది. నెల్లూరు జిల్లాలో 33.3, ప్రకాశం జిల్లాలో 25.3, బాపట్లలో 20, కృష్ణా జిల్లాలో 43.8, పశ్చిమగోదావరిలో 52.5, కోనసీమలో 31.1, కాకినాడలో 52.8, అనకాపల్లిలో 6.9, విశాఖపట్నం జిల్లాలో 25.9, విజయనగరం జిల్లాలో 3.1, శ్రీకాకుళం జిల్లాలో 31.6 శాతం తీరం కోతకు గురవుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 1000 కిలోమీటర్ల పొడవు ఉన్న ఏపీ తీర ప్రాంతంలో 31 శాతం.. అంటే ఓ 310 కిలోమీటర్ల తీర ప్రాంతం ప్రమాదకర స్థితిలో కోతకు గురవుతున్నట్లు కేంద్రం ప్రకటించడం మాత్రం షాకింగ్ పరిణామం.