ముఖ్యమంత్రి రేసు.. కోమటిరెడ్డికి అంత సత్తా ఉందా?

తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టుకు దగ్గరి దారేది? మొదట పీసీసీ చీఫ్ పదవి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పీసీసీ చీఫ్ గా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే బాటలో మన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి కలలుగంటున్నారు. పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ కాంగ్రెస్ అధిషానానికి ఆఫర్ ఇస్తున్నాడు. *పీసీసీ చీఫ్ రేసులో తీవ్ర పోటీ పీసీసీ చీఫ్ రేసు తెలంగాణ […]

Written By: Neelambaram, Updated On : May 24, 2020 5:57 pm
Follow us on


తెలంగాణ ముఖ్యమంత్రి పోస్టుకు దగ్గరి దారేది? మొదట పీసీసీ చీఫ్ పదవి. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం పీసీసీ చీఫ్ గా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే బాటలో మన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి కలలుగంటున్నారు. పీసీసీ చీఫ్ పదవిని ఇస్తే తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానంటూ కాంగ్రెస్ అధిషానానికి ఆఫర్ ఇస్తున్నాడు.

*పీసీసీ చీఫ్ రేసులో తీవ్ర పోటీ
పీసీసీ చీఫ్ రేసు తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు పుట్టిస్తోంది. ఈ పోస్టు కోసం దాదాపు 10 మంది వరకు పోటీపడుతున్నారు. రేవంత్ రెడ్డికి చాన్స్ దక్కకుండా కాంగ్రెస్ సీనియర్లు లాబీయింగ్ చేస్తున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తానేనని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి చాటింపు వేయించుకుంటున్నారు. ఇక దళితులకు ఇవ్వాలని వీహెచ్, భట్టి విక్రమార్కలు డిమాండ్ చేస్తున్నారు. బీసీలకు ఇవ్వాలని శ్రీధర్ బాబు లాంటి వారు ముందుకొస్తున్నారు. ఇంతమందిలో కోమటిరెడ్డి మాత్రం అధిష్టానానికి తాజాగా భలే ఆఫర్ ఇచ్చారు.

*50మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తా..
ఓ ఇంగ్లీష్ చానెల్ తో తాజాగా కోమటిరెడ్డి మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అయితే టీఆర్ఎస్ కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి అన్నిరకాలుగా పాటుపడుతానని ఆయన అన్నారు. పాదయాత్రలు, బస్ యాత్రలు చేపట్టి.. నిత్యం ప్రజలతోనే ఉండి కాంగ్రెస్ ను తెలంగాణలో అధికారంలోకి తేవడమే తన లక్ష్యమన్నారు.

*కోమటిరెడ్డివి పగటి కలలేనా?
టీపీసీసీ చీఫ్ కావాలన్నది కోమటిరెడ్డి కల. దాన్ని నెరవేర్చుకోవడానికి ఏకంగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 50 మందిని లాగేసే సత్తా ఉందని కోమటిరెడ్డి అంటున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దెబ్బకు ఇప్పటికే కాంగ్రెస్ కుదేలైంది. అసెంబ్లీలో పట్టుమని పదిమంది ఎమ్మెల్యేలు కూడా లేని దుస్థితికి దిగజారింది. జీవన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి, స్వయంగా కోమటిరెడ్డి సైతం అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. పెద్దలు జానారెడ్డి గారే చరిత్రలోనే తొలిసారి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయి తన వరుస రికార్డు విజయాలకు బ్రేక్ వేసుకున్నారు. చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా ఎంపీ ఎన్నికల్లో ఓ మూడు సీట్లు గెలిచారు. ఉద్దండులైన నేతలే గులాబీ కారుకు నిలవలేకపోయారు. దాదాపు సీనియర్లు అంతా కారెక్కేశారు. అలాంటి దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి గట్టెక్కిస్తాననడమే పెద్ద వింత అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నలుగురు ఎమ్మెల్యేలు కూడా లేని కాంగ్రెస్ పార్టీలోకి 50 మంది గులాబీ ఎమ్మెల్యేలు వస్తారంటున్న కోమటిరెడ్డి మాటలు విని అందరూ నవ్వుకుంటున్నారు.

*కాంగ్రెస్ గుణపాఠం నేర్వదా?
తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పట్ల కాస్త సానుభూతి ఉంది. ఓటమితో గుణపాఠాలు నేర్చుకుంటే కాంగ్రెస్ కు భవిష్యత్ ఉంటుంది. ఇంత ఓడినా ఆత్మపరిశీలన చేసుకోకుండా పీసీసీ పీఠం కోసం ఇన్ని రాజకీయాలు.. కుమ్ములాటలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మొదట వాటన్నింటికి స్వస్తి పలికి.. నడిపించే నాయకుడిని ఎన్నుకొని తెలంగాణలో స్థిరత్వం సాధిస్తే తప్ప ఆ పార్టీ బతికిబట్టకట్టే చాన్సులు లేవు. అలాంటిది కోమటిరెడ్డి ఏకంగా 50 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాగేస్తాననడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆశకైనా హద్దుండాలంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. ముందు కాంగ్రెస్ దుకాణం సర్దుకుంటే మంచిదని.. ఆ తర్వాత టీఆర్ఎస్ నుంచి లాగడం చూసుకోవచ్చని సెటైర్లు వేస్తున్నారు.

-నరేశ్ ఎన్నం