
తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యోగులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉద్యమ నేత ఆయన. జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపారు. తెలంగాణ వచ్చాక నిరాదరణకు గురైన ఆయన ఓ పార్టీని స్థాపించారు. అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్.. ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. ఆయనే ప్రొఫెసర్ కోదండరాం.
Also Read: ‘వీహెచ్’ కథ వేరేలా ఉందిగా..!
నిత్యం ప్రజా సమస్యల మీద కోదండరాం పోరాడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజాసమస్యలను పరిష్కరించే వరకు తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగులు, రైతులు, ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు గాను చేపట్టిన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతినివ్వకపోవడం శోచనీయమన్నారు.
నిరుద్యోగ యువత, వ్యవసాయ సంక్షోభంతో దిగాలుపడ్డ రైతులు, దైన్యంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కోదండరాం 48 గంటల దీక్షకు దిగారు. మొదటగా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద దీక్షను నిర్వహించాలని నిర్ణయించగా.. పోలీసులు అనుమతించలేదు. దీంతో పార్టీ కార్యాలయంలోనే ఆయన దీక్షకు దిగారు. కోదండరాం దీక్షకు సీపీఐ, సీపీఎం, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, విద్యావేత్త చుక్కా రామయ్య సంఘీభావం ప్రకటించారు.
Also Read: ఓ వైపు చలి.. దానికితోడు వర్షం.. అయినా పట్టువదలని రైతులు
ప్రభుత్వం ఏర్పడి ఆరేళ్లయినా నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం దారుణమని.. దీంతో అనేక మంది నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం కూడా సంక్షోభంలో కూరుకుపోయిందని.. అన్నదాతలను కాపాడాల్సిన అవసరం కూడా ఉందన్నారు. 48 గంటలపాటు దీక్షను యథాతథంగా కొనసాగించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులు హైదరాబాద్ చేరుకోవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్