ఇంతింతై కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యి అన్నంతగా ఎదిగిపోయాడు. ఒకసామాన్య కార్యకర్తగా మొదలైన కిషన్ రెడ్డి ప్రస్థానం తాజాగా అత్యున్నత కేంద్ర పదవి వరించేదాకా సాగడం విశేషం. మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక సికింద్రాబాద్ ఎంపీగా తెలంగాణ నుంచి గెలిచిన కిషన్ రెడ్డికి కేంద్రహోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చాడు మోడీ. తాజాగా పునర్వ్యస్థీకరణలో ఏకంగా కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ పొందారు.
మూడు సార్లు వరుసగా తెలంగాణలో ఎమ్మెల్యేగా గెలిచిన కిషన్ రెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఓటమియే ఆయనకు కలిసి వచ్చింది. ఏకంగా ఎంపీ ఎన్నికల్లో గెలిచేలా చేసింది. అదే కిషన్ రెడ్డి జీవితంలో టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు. కృషి, పట్టుదల, నిజాయితీ, ఓర్పుతో కూడిన ఆయన వ్యక్తిత్వం, పనితనమే ఇప్పుడు మోడీ గుర్తించి ప్రమోషన్ ఇచ్చేలా చేసింది.
తాజాగా కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డితో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న సహకార మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి ఇస్తారని అంటున్నారు. కేంద్రం తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ కొత్త శాఖను కిషన్ రెడ్డికి ఇస్తున్నారంటే ఆయనకు ప్రాముఖ్యతను ఇస్తున్నట్టే లెక్క.
-కిషన్ రెడ్డి ప్రస్థానం..
-రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో 1960లో సాధారణ రైతు కుటుంబంలో గంగాపురం కిషన్ రెడ్డి జన్మించాడు. వాజ్ పేయి, జయప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో విద్యార్థి దశలోనే బీజేపీలో చేరారు.
-1977లో రాజకీయాల్లో వచ్చి పార్టీలో సాధారణకార్యకర్త స్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు.
-ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు సార్లు , తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒకసారి పనిచేశారు.
-అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా రెండు సార్లు వ్యవహరించారు.
-1980లో బీజేపీలో చేరారు. 2002-04 వరకు బీజేపీ యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.
-1999లో కార్వాన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.
-2004లో హిమాయత్ సాగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
-2009,2014లో వరుసగా రెండు సార్లు అంబర్ పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో స్వల్ప తేడాతో ఓడిపోయారు.
-2019 ఎంపీ ఎన్నికల్లో సికింద్రాబాద్ఎంపీగా గెలిచారు. దీంతో మోడీ కేబినెట్ లో హోంశాఖసహాయ మంత్రి పదవి దక్కించుకున్నాడు. ఇప్పుడు మరో ప్రమోషన్ తో ఏకంగా కేబినెట్ మంత్రి అయ్యారు.