Chandrababu: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. ఈనెల 28 తో ఆయన బెయిల్ గడువు ముగియనుంది. అయితే ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని కోర్టుకు ఆయన తరపు న్యాయవాదులు వివరాలతో కూడిన నివేదికలను అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ గడువు పెంచాలని కోరారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉండగానే ఈరోజు శాశ్విత బెయిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు వర్గాల లాయర్లు తమ వాదనలు వినిపించారు.
అయితే చంద్రబాబు బెయిల్ పై బలమైన వాదనలు కొనసాగినట్లు తెలుస్తోంది. సిఐడి తరుపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్ర వాదనలు వినిపించారు. ఇది ముమ్మాటికి రాజకీయ కక్ష కేసు అని.. ఎన్నికల ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని సిద్ధార్థ లూధ్ర న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. బెయిల్ పై విచారణ జరుగుతున్న సందర్భంలో కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావిడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును పక్కాగా ఇరికించారని వాదించారు.
అయితే దీనిపై అదే స్థాయిలో సిఐడి ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తన వైపు నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేశారు. ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్లో ఉన్నారు. అనారోగ్య కారణాల దృష్ట్యా ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు కంటి ఆపరేషన్ సైతం పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఐదు వారాలపాటు స్పెషల్ అబ్జర్వేషన్ అవసరమని.. దీనికి తోడు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని.. అనారోగ్య నివేదికలను చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇప్పటికే హైకోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ గడువు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు కావడం విశేషం.