
Vivek Ramaswamy: అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన ఎంతో మంది రాణిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఎంపీలు అయ్యారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత సంతికి చెందిన మహిళే. బ్రిటన్ కు ప్రధాని రిషి సునాక్ భారతీయుడే. తాజాగా లిస్ట్‌లో మరో వ్యక్తి చేరబోతున్నారు. భారత మూలాలున్న అమెరికన్ మల్టీ మిలియనీర్, రచయిత వివేక్ రామస్వామి 2024లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడం ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. అమెరికాను అన్ని విధాలుగా ఉత్తమంగా తీర్చి దిద్దాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలిపారు. అయితే, ఇప్పటికే ఆ పార్టీ తరపున నిక్కీ హేలీ అధ్యక్ష రేసులో ఉన్నారు. అయినా తాను ఆరు నూరైనా బరిలో ఉంటానని ప్రకటించారు.
యంగ్‌స్టర్ బ్యాక్‌గ్రౌండ్ ఇగీ..
కేవలం 37 ఏళ్ల వివేక్ రామస్వామి బయోటెక్నాలజీలో ఎక్స్‌పర్ట్. అంతే కాదు మంచి రచయిత కూడా. ‘‘వోక్ ఇంక్ : ఇన్‌సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కాం’’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకమే ఆయనకు పేరు తెచ్చి పెట్టింది. 2021 ఆగస్టులో పబ్లిష్ అయిన ఈ బుక్ సంచలనం సృష్టించింది. అమెరికాలో బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. దీంతోపాటు మరో పుస్తకమూ రాశారు వివేక్. అది కూడా ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది.
కేరళ నుంచి అమెరికాకు వలస..
వివేక్ తల్లిదండ్రులు కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఓహియోలో స్థిరపడ్డారు. వివేక్ బాల్యమంతా అక్కడే గడిచింది. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయాలజీలో బ్యాచ్‌లర్ డిగ్రీ చేశారు. యేల్ లా స్కూల్‌లో లా చదువుకున్నారు. ఓహియోలోని జనరల్ ఎలక్ట్రిక్ ప్లాంట్‌లో పని చేసిన ఆయన.. ఆ తరవాతే వ్యాపారం వైపు కదిలారు. 2014లో రోయివాంట్ సైన్సెస్ సంస్థను ఏర్పాటు చేశారు వివేక్. ఎన్నో వ్యాధులకు ఈ ఫార్మసీ కంపెనీ మందుల్ని తయారు చేస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఆ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్‌తోపాటు గుర్తింపు కూడా ఉంది. రోయివాంట్‌తో పాటు మరికొన్ని హెల్త్‌కేర్, టెక్నాలజీ కంపెనీలనూ స్థాపించారు. 2022లో ‘‘స్ట్రివ్ అసిస్ట్ మేనేజ్మెంట్’’ సంస్థను ప్రారంభించారు. ప్రజలకు రాజకీయాలపై అవగాహన కల్పించడం సహా.. వాళ్ల గొంతుకను వినిపించడమే లక్ష్యంగా ఈ కంపెనీ పెట్టారు వివేక్ రామస్వామి. 2016లో అమెరికాలోనే 40 ఏళ్ల లోపు అత్యంత సంపన్నమైన వ్యాపారుల్లో 24వ వ్యక్తిగా నిలిచారు. అప్పటికే ఆయన సంపద 600 మిలియన్ డాలర్లుగా ఉంది.

ఉత్తమ దేశంగా అమెరికా లక్ష్యం అంటూ…
అమెరికాను మరోసారి ఉత్తమ దేశంగా తీర్చిదిద్దాల్సిన అవసరముందని వివేక్ అభిప్రాయం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా అమెరికాలోని భవిష్యత్ తరాల కలలను దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమం చేపట్టారు. ‘మన రంగుని బట్టి కాదు గుణాన్ని బట్టి అవకాశాలు రావాలి. మన మెరిట్‌కు ప్రాధాన్యత దక్కాలి. ప్రస్తుతం సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడు అమెరికన్లలో ఎవరినైనా ‘దేశం ఎలా ఉందని’ ప్రశ్నిస్తే ఏ సమాధానమూ ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరేం సాధించగలరో ఓ సారి ఆలోచించండి. అందుకు అనుగుణంగా ముందుకెళ్లండి’ అని అమెరికన్లకు వివేక్ రామస్వామి పిలుపునిచ్చారు.
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈసారి ట్రంప్ కూడా బరిలో ఉంటానంటున్నారు. జో బైడెన్, నిక్కీ హేలీతోపాటు తాజాగా ఎన్‌ఆర్‌ఐ వివేక్ రామస్వామి బరిలోకి వచ్చారు. మరి అమెరికన్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి.