CM KCR: తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. కేసీఆర్ ఒక ఎత్తు వేస్తే.. కేంద్ర మరో ఎత్తు వేస్తోంది. మధ్యలో గవర్నర్ మరో పాలయింట్‌తో తెలంగాణ సర్కార్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ఎదుర్కొనేందుకు.. కేంద్రం ఎత్తులను చిత్తు చేసేందుకు ప్రగతిభవన్‌లో వ్యూహాలు రచిస్తున్నారు గులాబీ బాస్. ఈ క్రమంలో కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కమలం నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. రెండు పార్టీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

సెగలు రేపుతున్న ఈడీ, ఐటీ దాడులు..
తెలంగాణలో మొన్నటి వరకు మునుగోడు ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించాయి. ఫలితం వచ్చిన వెంటనే.. ఈడీ, ఐటీ దాడులు సెగలు రేపుతున్నాయి. టీఆర్‌ఎస్ నేతల ఇళ్లల్లో కేంద్ర బృందాలు వరుసగా సోదాలు చేయడంపై రాజకీయ దుమారం రేగుతోంది. కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని గులాబీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కమలం నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. ఈ క్రమంలో ఐటీ, ఈడీ దాడులపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు.
ఆ ఇద్దరితో కేసీఆర్ భేటీ..
మంత్రి గంగుల కమలాకర్‌తోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసాల్లో ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. దీంతో కేసీఆర్ వారిద్దరినీ గురువారం హుటాహుటిన ప్రగతి భవన్‌కు పిలిపించారు. వారితో చాలా సేపు చర్చించారు. ఈ దాడులకు కౌంటర్‌గా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై మంతనాలు జరిపినట్లు సమాచారం. సమావేశానికి పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కూడా హాజరయినట్లు తెలుస్తోంది.
మూడు రోజులుగా సోదాలు..
తెలంగాణలో బుధవారం నుంచి గ్రానైట్ కంపెనీల కార్యాలయాలు, వాటికి సంబంధించిన వారి ఇళ్లపై ఐటీ, ఈడీ దాడులు చేస్తోంది. ఇందులో భాగంగా మొదట మంత్రి గంగుల కమలాకర్ ఫ్యామిలీకి చెందిన శ్వేత, గాయత్రి గ్రానైట్ కంపెనీలపై దాడి చేశారు. ఆ తర్వాత ఆయన ఇంట్లో సోదాలు చేశారు. బుధవారం కరీంనగర్‌లో ఆయన ఇంట్లో లేని సమయంలో.. తలుపులు బద్దలు కొట్టిమరీ.. లోపలికి వెళ్లారు. ఇళ్లంతా తనిఖీలు చేసి.. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన రాష్ట్రానికి వచ్చారు. ఈడీకి సహకరించేందుకే దుబాయ్ నుంచి తిరిగి వచ్చానని.. సోదాల కోసం ఇంటి తాళాలు పగలగొట్టమని చెప్పింది తానేనని మంత్రి గంగుల తెలిపారు. సోదాల్లో ఎంత నగదును స్వాధీనం చేసుకున్నారో చెప్పాలని ఆయన అన్నారు. మైనింగ్ రాయల్టీ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని.. ఈ విషయంలో ఈడీకి ఏం సంబంధమో అర్థంకావడం లేదని విమర్శించారు. 31 ఏళ్ల నుంచి గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామని.. తాము ఎక్కడా ఫెమా నిబంధనలను ఉల్లంఘించలేదని స్పష్టం చేశారు.

దాడులను తప్పు పట్టిన ఎంపీ..
టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆఫీసులో ఈడీ, ఐటీ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఎంపీ గాయత్రి రవికి చెందిన ఆఫీసుల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేశారు. హైదరాబాద్‌తోపాటు కరీంనగర్‌లో ఏక కాలంలో తనిఖీలు చేపట్టారు. గ్రానైట్ కంపెనీలపై దాడులు చేయడం సరికాదని రవిచంద్ర విమర్శించారు. తన కుటుంబ సభ్యులతో పాటు సమీప బంధువు మంత్రి గంగుల కమలాకర్‌కు చెందిన గ్రానైట్ కంపెనీల్లో ఐటీ, ఈడీ సోదాలు చేయడాన్ని ఎంపీ తప్పు పట్టారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపునకు పాల్పడుతోందని.. ఐనప్పటికీ విచారణకు సహకరిస్తామని స్పష్టం చేశారు.
ఐటీ దాడులకు కేసీఆర్ ప్రతివ్యూహం..
మరోవైపు కేసీఆర్.. ఐటీ దాడులను ఎదుర్కొనేందుకు, తిప్పికొట్టేందుకు ప్రతివ్యూహం రచిస్తున్నారు. ఈమేరకు కేంద్రంలో తనకున్న సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు మరికొంతమంది టీఆర్‌ఎస్ నేతలపై కూడా దాడులు జరుగవచ్చని సమాచారం వస్తోంది. దీంతో ఎలా ఎదుర్కొనాలనే ఆలోచన చేస్తున్నారట గులాబీ బాస్. ఐటీ, ఈడీ అధికారుల సోదాల్లో ఎలాంటి ఆధారాలు దొరకకుంటే కేంద్రం తీరును తూర్పారపట్టేందుకు కేసీఆర్ సమాయత్తం అవుతున్నారు. తొందరపడి మాట్లాడితే ఇరుక్కుపోయే ప్రమాదం కూడా ఉందని టీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.