Pawan Kalyan- PM Modi: అది ప్రధాని మోదీ పర్యటన. ఏర్పాట్లు చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని ఏ రాష్ట్రంలో పర్యటించినా జరిగింది ఇదే. కానీ ప్రస్తుతం ఏపీలో మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. వైసీపీ కింది స్థాయి నాయకుడి నుంచి మంత్రుల వరకూ పగలూ రాత్రి అన్న తేడా లేకుండా ప్రధాని విశాఖ టూర్ ను సక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి అయితే గత నాలుగైదు రోజులుగా విశాఖలో మకాం వేసి మరీ పర్యాటన ఏర్పాట్లు చేస్తున్నారు.అయితే ఇంత చేస్తున్నా అధికార పార్టీ నాయకులకు ఒకటి మాత్రం మింగుడుపడడం లేదు. ఒళ్లు హోనం చేసుకొని ఏ నాయకుడి పర్యటనకైతే తపిస్తున్నామో.. ఆ నాయకుడ్ని దూరం నుంచి చూసి ఉండిపోవడమే తప్ప.. దగ్గరగా మాట్లాడే చాన్స్ దొరకలేదు అన్న బాధ వారిని వెంటాడుతోంది. కానీ ఏ సంబంధం లేని జనసేన అధ్యక్షుడు పవన్ కు ప్రధాని సమయం ఇవ్వడం ఏమిటి? మిమ్మల్ని ప్రధాని కలుస్తారు. ఆ సమయంలో అందుబాటులో ఉండాలని పీఎంవో నుంచి ఆహ్వానం ఏమిటి? అని మాత్రం సగటు వైసీపీ నేత నుంచి మంత్రుల వరకూ తెగ బాధపడిపోతున్నారు. జరుగుతున్న పరిణామాలు చూసి.. జరగబోయే పరిణామాలను తలుచుకొని కలవరపాటకు గురవుతున్నారు.

ఒక విధంగా చెప్పాలంటే పవన్ కు ఇది ఓపెన్ ఆఫరే. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షంగా ఉన్నా ఈ మూడున్నరేళ్లలో పవన్ ప్రధానిని కలిసింది ఒక్కసారే. గడిచిన ఎన్నికల్లో ఓటమి తరువాత రెండు పార్టీలు కలిశాయి. కలిసే ముందుకెళ్లాలని సూచించారు. కానీ కలిసి కార్యక్రమాలు నిర్వహించింది లేదు. దీంతో ఇటీవల జరిగిన పరిణామాలతో పవన్ హాట్ కామెంట్స్ చేశారు, తనకు బీజేపీ, ప్రధాని మోదీ అన్న అభిమానం, గౌరవం ఉంది కానీ… రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అవసరమైతే తన ఆలోచనలు, వ్యూహాలు మార్చుకుంటానని సంకేతాలిచ్చారు. వైసీపీ ప్రభుత్వంపై పోరాడడానికి కేంద్ర పెద్దలు రూట్ మ్యాప్ ఇస్తారని చెప్పి మూడేళ్లుగా జాప్యం చేస్తూ వచ్చారని కూడా పవన్ వ్యాఖ్యానించారు. అయితే ఈ కామెంట్స్ తో పవన్ పని అయిపోయిందని.. బీజేపీ అగ్రనేతలు పవన్ ను వదులకుంటారని.. వారి మధ్య దూరం పెరగడం ఖాయమని వైసీపీ నేతలకు అంచనాకు వచ్చారు. కానీ తాజాగా నేరుగా పీఎంవో నుంచే పవన్ కు ఆహ్వానం అందడంతో అంచనాలు తప్పయ్యాయని భావిస్తున్నారు.

అయితే ప్రధానితో మీటింగ్ తరువాత కానీ పవన్ వాయిస్ పెరిగితే మాత్రం తమకు ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావాల్సి ఉంటుందని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశముంది. రూట్ మ్యాప్ పై బాహటంగా తాను వ్యక్తం చేసిన బాధ ప్రస్తావన తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అటు వైసీపీ విధ్వంసకర పాలన గురించి ఫిర్యాదు చేసే అవకాశాలు సైతం ఉన్నాయి. కానీ ఇప్పటికే ఇవన్నీ ప్రధాని దృష్టిలో ఉన్నాయని.. పవన్ చేతిలో రూట్ మ్యాప్ పెట్టడంతో పాటు కొన్ని రాజకీయ సంకేతాలు ఇచ్చే అవకాశాలున్నాయని బీజేపీలో కొంతమంది నాయకులు చెబుతున్నారు. అదే జరిగితే ఇక పవన్ వెంట బీజేపీ శ్రేణులు నడవవాల్సిందే. అప్పుడు పవన్ ను అడ్డుకోవడానికి చూస్తే ఆటోమేటిక్ గా కేంద్రం కూడా రియాక్టు అయ్యే అవకాశముంది. అయితే మున్ముందు పవన్ రూపంలో తమకు చుక్కలు ఖాయమని వైసీపీ నేతలు సైతం ఒక డిసైడ్ కు వచ్చేశారు.