
కరోనా సెకండ్ వేవ్ తో ఇప్పుడు ఆస్పత్రులన్నీ నిండిపోతున్నాయి. బెడ్స్ ఖాళీగా లేక నానాయాతన పడుతున్నారు. కరోనా కేసులు జెట్ స్పీడుగా పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే మళ్లీ లాక్ డౌన్ పెట్టాలన్న డిమాండ్ పెరిగిపోతోంది. ఇప్పటికే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు సహా మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, కర్ఫ్యూలు పెట్టేశాయి.దీంతో తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం తాజాగా లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేశారు.
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ విధించబోమని సీఎం కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేసీఆర్ ప్రగతిభవన్ లో సమీక్షించారు. గత అనుభవాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించినా కేసుల సంఖ్య తగ్గడం లేదని కేసీఆర్ వివరణ ఇచ్చారు.
లాక్ డౌన్ తో ప్రజాజీవనం స్తంభించిపోతుందని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రానికి కావాల్సిన ఆక్సిజన్, వ్యాక్సిన్లు, రెమెడిసివిర్ సరఫరాపై ప్రధాని మోడీతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. వాటిని తక్షణమే రాష్ట్రానికి సమకూర్చాలని ప్రధానిని కోరారు. రాష్ట్రానికి ఆక్సిజన్, రెమెడిసివిర్ ఇంజక్షన్లు పెంచాలని కోరారు.
ప్రధాని మోడీ ఆదేశాల మేరకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సీఎం కేసీఆర్ తో మాట్లాడారు. ప్రధాని మోడీకి కేసీఆర్ విన్నవించిన అంశాలన్నింటిని సత్వరమే తెలంగాణకు సమకూరుస్తామని గోయల్ హామీ ఇచ్చారు.