KCR: అనవసరం అనుకుంటే నాలుగు అడుగులు వెనక్కి, అవసరం ఉంటే రెండడుగులు ముందుకు వేసేందుకు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు సీఎం కేసీఆర్. ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం తీరుపై, కేంద్రనాయకత్వంపై ఒకవిధంగా, ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంపై ఇంకో విధంగా వ్యవహరిస్తూ వచ్చేవారు. ఇన్ని రోజులు ఏ విషయంలోనైనా కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర నాయకత్వంపై నోరు మెదపకుండా, రాష్ట్ర నాయకత్వాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించేవారు. కానీ తాజా పరిస్థితులు చూస్తే అందుకు పూర్తి భిన్నంగా మారిపోయాయి. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు వ్యూహాలు, కార్యాచరణను రూపొందిస్తున్నారని అర్థమవుతోంది. తనపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో తన రాజకీయ ఆధిపత్యాన్ని చాటుకుని, నిలుపుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయనే చెప్పాలి.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తన పట్టును నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో గులాబీ బాస్.. రాష్ట్ర బీజేపీ నాయకత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా సెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది. ఈ రాజకీయ వ్యూహం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ బలం పుంజుకోకుండా తన పట్టును నిలుపుకోవాలనే ప్రయత్నాలను తీవ్రం చేశారని స్పష్టంగా కనిపిస్తోంది. హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. ఈ క్రమంలో పార్టీ నాయకులకు, ప్రజలకు టీఆర్ఎస్ పై నమ్మకం సన్నగిల్లకుండా.. బీజేపీ వైపు మల్లకుండా సీఎం కేసీఆర్ స్వయంగా ముందుకు వచ్చి రాష్ట్ర బీజేపీ నాయకులతో పాటు కేంద్రం పై కూడా విమర్శల అస్త్రాలను వదులుతున్నారు.
దీని కోసం వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని వారధిగా చేసుకున్నారు. రాష్ట్రంలో పండిన పంట మొత్తం కేంద్రమే కొనాలంటూ గళం ఎత్తారు. కొంటారా.. కొనరా..? అంటూ డిమాండ్ చేస్తు.. కేంద్రంపై యుద్దం ప్రకటించిన కేసీఆర్.. అవసరం అయితే ఢిల్లీలో కూడా నిరసనలు చేస్తామన్నారు. తాజాగా గురువారం నిర్వహించిన మహా ధర్నాలో పాల్గొన్న టీఆర్ఎస్ చీఫ్.. బీజేపీ నుంచి దేశానికి విముక్తి కలిపించాలన్నారు. మరో పోరాటం చేయకుంటే దేశానికి విముక్తి లేదన్న కేసీఆర్ మాటలతో.. ఆ దిశగా అడుగులు వేసేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు కేంద్రానికి భయపడేది లేదని తేల్చి చెప్పారు.
నిజానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ముందు 2009 నుంచి బీజేపీతో స్నేహ హస్తం కోరుకున్న కేసీఆర్.. 2009 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చారు. అయితే ఆ ఎలక్షన్లో కమలం పార్టీ ఓటమి పాలయింది. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిప్రభుత్వం ఏర్పాటు చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా కేంద్రానికి చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేశారు కేసీఆర్. కేంద్రం అమలు చేసిన కీలక విధానపరమైన అంశాల్లో బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటిస్తూ వచ్చారు. బీజేపీకి మద్ధతు ఇవ్వడానికి ఎలాంటి ఛాన్స్ వచ్చినా సీఎం కేసీఆర్ దాన్ని వదులుకోలేదు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు, త్రిపుల్ తలాక్ బిల్లు, సిటిజన్షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ , 370 ఆర్టికల్ రద్దు లాంటి కీలక విషయాల్లో బీజేపీకి మద్ధతు పలికారు కేసీఆర్.
దీంతో పాటు ఎన్డీయేలో చేరేందుకు కూడా గులాబీ బాస్ చాలా ప్రయత్నించారు. కానీ ఎందుకో అది విఫలం అయింది. ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రాష్ట్రంలో తన పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీని వ్యతిరేకించాల్సిన పరిస్థితి కేసీఆర్ కు ఏర్పడిందని అంటున్నారు. దీనికి మరో కారణంగా.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గిపోతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆ సందర్భంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే.. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీ అధినాయకత్వం కేసీఆర్ మద్ధతు కోరాల్సి ఉంటుంది. దీన్ని బేస్ చేసుకుని కూడా కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడనే అంచనాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అందులో భాగంగానే డేర్‌గా కేంద్ర ప్రభుత్వానికి భయపడాల్సిన గత్యంతరం రాలేదని చెప్పుకొస్తున్నారు కేసీఆర్.
Also Read: KCR Dharna Chouwk: ధర్నా చౌక్ ఎత్తేసిన కేసీఆర్ కు ఇప్పుడు అదే దిక్కైంది?
వాస్తవానికి కేంద్రాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు జరుగుతాయి అనే వాదనలు కూడా చాలా వచ్చాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా కేంద్రానికి గళం విప్పడంతో ఆయనపై కూడా ఈడీ దాడులు జరుగుతాయనే ప్రచారం గత కొన్ని రోజులుగా సాగుతోంది. అయితే, ఇది సాధ్యమయ్యే పని కాదని, ఒకవేళ సీఏం కేసీఆర్ పై ఈడీ దాడులు చేయిస్తే బీజేపీ కే నష్టం జరుగుతుందని చెబుతున్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో బీజేపీ పై దుష్ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఈ కారణంగానే తన పై ఎలాంటి ప్రొసిడింగ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగదనే ధీమాతోనే కేసీఆర్ భయపడకుండా ముందుకు సాగుతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో కేసీఆర్ తీరుపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read: BC calculation: బీసీ గణనకు కేంద్రం అంగీకరిస్తుందా?