KCR: ‘‘ ఇటీవల రెండు సార్లు ఢిల్లీ పోయిన. అక్కడ ప్రధాని మోదీని కలిసిన. అగో ఇదేంది సర్.. మా రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇస్తలేరని గట్టిగా అడిగిన. ఆయన సప్పుడు చేయలే. అతడి నిర్లక్ష్యాన్ని చూసి ఆగలేక పోయిన. అక్కడే గొడవ పెట్టుకున్న. నిధులు ఎట్లాగూ ఇస్తలేరు. కనీసం కళాకారులను కూడా పట్టించుకోవడం లేదని నిలదీసిన. పద్మశ్రీ అవార్డుల కోసం ప్రతీసారి ప్రతిపాదన పంపిస్తే.. మీరు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని అడిగిన. అమిషాను కలిసి కూడా ఇదే ముచ్చట మాట్లడితే.. ఆయన కూడా ఎం చెప్తలేడు. ఇగ గిట్ల కాదు.. కేంద్రమో.. మనమో తేల్చుకునుడే.’’ అంటూ కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన మాటలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదంటా.. ఇన్నాళ్లు కేంద్రం, సీఎం మధ్య జరిగిన చిన్న విషయాన్ని కూడా పెద్దదిగా చూపించిన మీడియా కూడా ఈ అంశంపై పెద్దగా ఫోకస్ చేయలేదంటా.. కారణం ఏంటోనని గులాబీ సైనికులు వెతుకుతుండగా.. ఇందులో కొత్తేముందని ప్రజలు అనుకుంటున్నారు..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసి వచ్చిన ప్రతీసారి ఏదో ఒక సంచలన ప్రకటన చేస్తుంటారు. వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే మీడియా సమావేశమో.. అధికారులతో సమీక్ష ఏర్పాటు చేసో రాష్ట్ర పాలనపై, కొత్త పథకాలపై చర్చిస్తుంటారు. ఇటీవల కాలంలో రెండు సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం మొదటిసారి వచ్చిన వెంటనే వరి వేయొద్దని సంచలన ప్రకటన చేశారు. ప్రత్యామ్నాయ సాగులపై రైతులు దృష్టి సారించాలని కోరారు. రైతులకు అవగాహన కల్పించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఇదే సమయంలో కేంద్రంపై దుమ్మెత్తి పోశారు. కేంద్రం వడ్లు కొననంటోందని, వరి బదులు వేరే పంటలు వేయాలని చెబుతోందని ప్రకటన చేశారు. రైసుమిల్లర్లతో సైతం సమావేశం నిర్వహించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని చెప్పారు.
ఇదే క్రమంలో కాళేశ్వరం కట్టాం.. ధాన్యం పుష్కలంగా పండుతోంది. ఈ సమయంలో రైతులను ఇబ్బంది పెట్టొద్దు. అవసరమైతే ధాన్యం ఎగుమతిని పెంచుతూ.. నిబంధనలు ఎత్తివేయాలని కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కోరాడని.. బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు. ఇదే సమయంలో పలు అంశాలపై కూడా ఈ నెలరోజుల వ్యవధిలో రెండోసారి సీఎం ఢిల్లీకి వెళ్లి అమిత్ షా.. ఇతర మంత్రులతో చర్చించినట్లు చెబుతున్నారు.
అయితే.. సోమవారం నాటి అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నాళ్లు ఓపిక పడతాం.. ఇక సమరమే అంటూ ఊగిపోయారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన విషయంలో కేంద్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మన సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే కనీసం పట్టించుకోకుండా.. పెడచెవిన పెట్టారని అన్నారు. జోగులాంబ అభివృద్ధి గురించి ఏళ్లకాలంగా ఎంత మొత్తుకున్నా వారు పట్టించుకోవడం లేదని ఇక మనమే మన పురాతన ఆలయాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి వచ్చిన ప్రతీసారి ఊగిపోతున్నారు. ఏదో ఒక సమస్యపై చర్చకు దారితీస్తున్నారు. దీనిపై లోకల్ బీజేపీ నాయకులు మాత్రం కేసీఆర్ మోదీ, అమిత్ షాకు బయపడే తరుచూ ఢిల్లీకి వెళ్తున్నాడని వ్యాఖ్యలు చేస్తుండగా.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేమో.. కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. కనీసం పట్టించుకోవడం లేని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీటూర్ ప్రతీసారి చర్చకు దారితీస్తుండగా.. ఇందులో కొత్తేముందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరేమో.. హుజూరాబాద్ ఎలక్షన్ల నేపథ్యంలో సీఎం ఢిల్లీకి వెళ్లారని.. భవిష్యత్ లో బీజేపీతోనే దోస్తీ కడతారని అంటున్నారు. మమతను ఓడించేందుకు సలహాలు సైతం ఇచ్చారని ఇంకొందరు చెబుతుండగా.. నేనసలు కేంద్రంతో దోస్తీనే చేయని సీఎం కేసీఆర్ బాహాటంగానే ప్రకటించేస్తున్నారు. రెండేళ్లలో ఎలక్షన్లు రాబోతున్న క్రమంలో కేంద్రంపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్ మరో వ్యూహానికి పథకం రచిస్తున్నట్లు తెలుస్తోంది.