KCR vs BJP: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యర్థులపై విరుచుకుపడటంలో సిద్ధహస్తులే. అదను కోసం వేచి చూసే ధోరణి ఆయనది. ఎన్ని విమర్శలు చేసినా ఒకేసారి సమాధానం చెప్పడం ఆయనకు అలవాటు. అందుకే 22 ఏళ్ల టీఆర్ఎస్ ప్రస్థానంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకున్నారు. ఎందరి ప్రశ్నలకో సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం కేంద్రంతో నెలకొన్న అభిప్రాయ భేదాలు, ప్రధాని, అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారు కేసీఆర్ ను కడిగేసినా ఆయన మౌనం వహించడం వెనుక ఏదో బలమైన కారణమే ఉందనే వాదనలు వస్తున్నాయి. ఎద్దు ఎగిరినప్పుడే గంట ఎగరదన్నట్లు విమర్శలన్నింటికి ఒకేసారి ఘాటైన సమాధానం చెప్పేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు అప్పు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతోంది. దీంతో ఉద్యోగుల వేతనాలు, సంక్షేమ పథకాల అమలుకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక స్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. దీనిపై కూడా కేసీఆర్ ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా మారిందని మీడియా సైతం గగ్గోలు పెడుతున్నా కేసీఆర్, నేతలు కూడా ఖండించడం లేదంటే పరిస్థితి నిజంగానే కష్టంగా మారినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ మెడకు నిధుల ఉచ్చు తగులుతోంది. ఎలా గట్టెక్కాలని తాపత్రయపడుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: AP Teacher: మోడీ అభినందన అందుకున్న ఆంద్రప్రదేశ్ మాస్టార్ ఎవరు? ఆయన కథేంటి?
దీంతో కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది. కేంద్రం అప్పు ఇచ్చేందుకు అడ్డు తగులుతున్న క్రమంలో ఇక ఏం చేయాలనే దానిపై కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు తొలగించుకునేందుకు అప్పు చేయడమే మార్గం. కానీ కేంద్రం విధిస్తన్న నిబంధనలతో అప్పు పుట్టే మార్గం కనిపించడం లేదు. ఈ మేరకు నేతలు కూడా పలుమార్లు కేంద్రం తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా ఏం ప్రయోజనం కనిపించడం లేదు ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారనే దానిపై అందరికి సందేహాలు వస్తున్నాయి.
జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరపనున్నారు. దీని కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ ఇదే వేదికపై కేంద్రంపై విమర్శలు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రంలో సమస్యలు పెరుగుతున్నందున బీజేపీ విధానాలకు సరైన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఇన్నాళ్లు బీజేపీ చేస్తున్న విమర్శలకు అన్నింటికి ఒకే సమాధానం చెప్పేందుకు రెడీ అయినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ మదిలో ఏముందో కూడా ఎవరికి తెలియడం లేదు. కానీ బీజేపీని మాత్రం టార్గెట్ చేసుకున్నట్లు భోగట్టా.
ప్రస్తుతం జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఉత్తరాది రాష్ట్రాలు తిరిగి అందరి మద్దతు కూడగడుతున్నారు.
మరోవైపు దక్షిణాదిలో కూడా పట్టు నిలుపుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్రంపై నిప్పులు కక్కే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే కేంద్రం విధిస్తున్న ఆంక్షలతో కుదేలైపోతున్న రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఏం చర్యలు తీసుకోనున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఉపయోగించుకుని సీఎం కేసీఆర్ ఏ రకమైన వ్యూహాలు అమలు చేస్తారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read:Pawan Kalyan Konaseema: ‘కోనసీమ’ కేసులు.. రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఇక పోరాటమే!