KCR- Dalit CM Pledge: ‘తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే.. నేను కాపలా కుక్కలెక్క ఉంట.. కేసీఆర్ మాట ఇచ్చిండంటే తల నరుక్కుంటడుగానీ తప్పడు’ 2014లో జరిగిన తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో గులాబీ బాస్ కె.చంద్రశేఖర్‌రావు ప్రజలకు ఇచ్చిన స్పష్టమైన హామీ. ఈ హామీని నమ్మిన దళితులు ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అండగా నిలిచారు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది.. దళిత సీఎం హామీని పక్కన పెట్టిన కేసీఆర్ తానే సీఎం కుర్చిపై కూర్చున్నారు. ఈ మోసం దళితుల మదిని తొలుస్తూనే ఉంది. దీనిని మరింత రెచ్చగొట్టేలా ఏడాది క్రితం ‘దళిత సీఎం కానందుకు ప్రజలు నన్ను ఓడించారా.. రెండోసారి కూడా అధికారం ఇచ్చారు. అలాంటప్పుడు దళిత సీఎం హామీకి విలువ ఎక్కడిది. అది ముగిసిన అధ్యయనం’ అని కేసీఆర్ ప్రకటించారు. దీంతో దళితులు గులాబీ పార్టీపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు విపక్షాలు ఈ హామీని పదేపదే గుర్తుచేస్తున్నాయి. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాయి.

అంబేద్కర్ పేరుతో రాజకీయం..
కొన్ని రోజులుగా అంబేద్కర్ పేరుతోల టీఆర్‌ఎస్ పార్టీ రాజకీయం మొదలుపెట్టింది. కేంద్రం ఢిల్లీలో నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్‌పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. వాస్తవానికి ఈ డిమాండ్‌ను మొదట చేసింది ప్రజాగాయకుడు గద్దర్. ఆయన ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం ఇచ్చారు. దీనిని గుర్తించిన అధికార టీఆర్‌ఎస్ దానిని ఓన్‌చేసుకునే పనిలో పడింది. ఇటీవల మూడు రోజులు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనూ దీనిపై తీర్మానం కూడా చేసింది. అయితే కొత్త సచివాలయానికి ముందు అంబేద్కర్ పేరు పెట్టాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో విధిలేని పరిస్థితిలో కేసీఆర్ తాను చూపిన పేరు తానే మొదట సచివాలయానికి పెట్టాల్సిన పరిస్థితిని స్వయంగా కల్పించుకున్నారు. ఈమేకు కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
ఎవరూ అడగకున్నా..
నిజానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఎవరూ కోరలేదు. డిమాండ్ చేయలేదు. కానీ ముందుగానే పెట్టేస్తే.. బీజేపీపై ఒత్తిడి పెంచవచ్చని అనుకున్నారు సీఎం కేసీఆర్. కానీ ఆ విషయం ఇప్పుడు రివర్స్ అయ్యేలా ఉంది. ఎందుకంటే పెట్టాల్సింది అంబేద్కర్ పేరు కాదు.. తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాటలను నిలబెట్టుకోవడం అని విపక్షాలు అంటున్నాయి. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో .. ప్రత్యేక రాష్ట్రం వస్తే తాను సీఎంను కానని దిళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానని రెండు సార్లు తానే సీఎం అయ్యారు. ఎన్నిసార్లు గెలిచినా తానే సీఎంనని చెబుతున్నారు. సీఎంను చేస్తానంటే దళితులే వద్దన్నారని ఒకటి.. రెండు సార్లు కవర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కువ చర్చ జరిగితే సమస్య అని సాగదీయలేదు. కానీ ఇప్పుడు.. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో మళ్లీ దళిత సీఎం హామీ తెరపైకి వచ్చింది. దళితుల్ని ఆకట్టుకుందామని ప్రయత్నిస్తే దళిత సీఎంహామీ వెలుగులోకి రావడం .. దాన్నే బీజేపీ , కాంగ్రెస్ ప్రధానంగా దళిత వర్గాల్లోకి తీసుకెళ్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది.

గోకకున్నా గోకుతున్నారు..
ఇటీవల నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో సీఎం కేసీఆర్ నరేంద్రమోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ‘మోదీ నువ్వు గోకకున్నా.. నేను గోకుతూనే ఉంటా’ అని ప్రకటించారు. ఇప్పుడు ఇదే గోకుడు దళిత సీఎం హామీ విషయంలో గులాబీ బాస్ ఎదుక్కునే పరిస్థితి తలెత్తుతోంది. దళిత సీఎం హామీని విస్మరించడంతో ప్రస్తుతం అది రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉంది. ఈ సమయంలో కేసీఆర్ దళితుల ఓట్ల కోసం మద్దతుగా మాట్లాడుతున్నట్లు ప్రకటించడం, హామీలు నిలబెట్టుకున్నట్లు ప్రకటనలు చేయడం, తాజాగా సెకక్రెటిరియేట్‌కు పేరు పెట్టడం, పార్లమెంట్‌కు కూడా పేరు పెట్టాలని ప్రధానికి లేఖ రాస్తానని ప్రకటించడం వంటివి దళిత సీఎం హామీని మళ్లీ తెరపైకి తెస్తున్నాయి. ఇప్పటికే అనేక విషయాల్లో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైంది. ఈ సమయంలో ఇలా పాతహామీలన్నీ తెరపైకి రావడం .. వచ్చేలా చేసుకోవడం టీఆర్‌ఎస్‌కే ఇబ్బందికరంగా మారుతోంది. కేసీఆర్ భాషలో చెప్పాలంటే దళితులు గోకకున్నా.. కేసీఆరే గోకిచ్చుకుంటున్నారు’