KCR- Kumaraswamy: దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లో కట్టేయమన్నాడట వెనుకటికి ఒకడు. ఈ సామెత మాదిరే నిన్న కేసీఆర్ వ్యవహరించారు. తన పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ప్రకాష్ రాజ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, కొంతమంది రైతు సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన విధి విధానాలను కెసిఆర్ ప్రకటించారు. ఇదే సమయంలో కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఇటు తెలంగాణ, అటు కర్ణాటక రాజకీయాల్లో చర్చ మొదలైంది.

సాధ్యమవుతుందా
ఏ మాటకు ఆ మాట… కర్ణాటక రాష్ట్రంలో ఇప్పుడు కుమారస్వామి ప్రభ అంతగా లేదు.. ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో ఆయన అడ్డంగా ఫెయిల్ అయ్యాడు.. గతంలో కాంగ్రెస్, బిజెపి అనైక్యత వల్ల కుమారస్వామి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన బంధువులు అధికారాన్ని ఏలారు. అవినీతి పెచ్చరిల్లిపోయింది. దీంతో కుమారస్వామి మరుసటి ఎన్నికల్లో ఓడిపోవలసి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన అధికారానికి దూరంగా ఉన్నారు. పైగా ఇదే సమయంలో కాంగ్రెస్, బిజెపి పుంజుకున్నాయి.
అరచేతిలో స్వర్గాన్ని చూపించారా
అరచేతిలో స్వర్గాన్ని చూపించడం కెసిఆర్ కు బాగా అలవాటు.. ఆయన ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు అదే పంథా. ఎవరు చెప్పిన కూడా తాను ఈ విధానాన్ని విస్మరించడు.. పైగా తనది భారీ చేయని అందరి ముందు చెప్పుకుంటూ ఉంటాడు. నిన్న జరిగిన టిఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో కూడా కుమారస్వామిని కర్ణాటక ముఖ్యమంత్రిని చేస్తానని భారీ ఆఫర్ ప్రకటించాడు. కానీ కర్ణాటకలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవాలని బిజెపి కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఇటీవల నరేంద్ర మోడీ ప్రారంభించారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రానికి కేంద్రం భారీగా నిధులను విడుదల చేయనుంది.. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలో కుమారస్వామిని ముఖ్యమంత్రి ఎలా చేస్తారో కెసిఆర్కే తెలియాలి.
దానికోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా
ప్రస్తుతం భారత రాష్ట్ర సమితికి తెలంగాణలో ఉన్న నేతలు తప్ప బయట ప్రాంతానికి చెందిన వారు లేరు.. ఆ మధ్య కేసీఆర్ వరుసగా పర్యటనలు చేశారు గాని… పెద్దగా క్లిక్ అయినట్టు కనిపించలేదు.. నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రివాల్, హేమంత్ సోరేన్, నితీష్ కుమార్… ఎవరు కూడా కేసీఆర్ వెంట నడవడం లేదు. అయితే కేవలం కుమారస్వామి, సినీ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే దక్షిణాది రాష్ట్రాల నుంచి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.. అయితే ఉన్న ఈ కుమారస్వామి కూడా పోతే తన జాతీయ కలలు ఆదిలోనే కల్లలు అవుతాయని భావించి కెసిఆర్ నిన్న ఆవిర్భావ సమావేశంలో కుమారస్వామికి బంపర్ ఆఫర్ ఇచ్చారు.

కాంగ్రెస్ ఊరుకుంటుందా?
ప్రస్తుతం శివకుమార్ నేతృతంలోని కర్ణాటక పిసిసి ఉత్సాహంగా పనిచేస్తోంది. అధికార బిజెపితో సై అంటే సై అంటున్నది. మొన్న జరిగిన హిజాబ్ గొడవ లో బిజెపి ప్రభుత్వాన్ని ఎంత ఇరుకున పెట్టాలో అంత ఇరుకున పెట్టింది. కానీ ఈ విషయంలో కుమారస్వామి నిశ్శబ్దంగా ఉన్నారు. ఒకవేళ రేపటి నాడు కర్ణాటకలో ఎన్నికలు జరిగి బిజెపికి కొంతమేర సహాయం కావాలి అనుకున్నప్పుడు కుమారస్వామి కచ్చితంగా ఇవ్వగలడు. ఎందుకంటే కుమార స్వామి అంత నమ్మ బుల్ కాండిడేట్ కాదు.. అంతదాకా వస్తే కేసీఆర్ కూడా అదే బాపతు. సో నిన్న కుమారస్వామికి కేసీఆర్ బిస్కెట్ వేశారు. మరి దానిని కుమారస్వామి ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.