
రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరం ఊహించలేం. తాను విమర్శించిన పార్టీలోకి చివరికి తానే వెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటి సందర్భాలను చూస్తూనే ఉన్నాం. అయితే.. అలా కొందరు వెళ్లి కోవర్టులుగా అవతార మెత్తిన వారిని సైతం చూస్తుంటాం. రాజకీయాల్లో ఈ కోవర్టుల హవా అంతా ఇంతా కాదు. ఒకపార్టీలో ఉంటూ.. ఆ పార్టీకి సంబంధించిన లీకులను ఇతర పార్టీలకు చేరవేయడమే వీరి ప్రధాన పని. ఇతర పార్టీలు ఎదగడానికి షాడోలా పనిచేస్తుంటారు. సొంత పార్టీని బద్నాం చేస్తుంటారు.
అయితే.. తెలంగాణలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీలోనూ ఈ కోవర్టులకు కొదవలేదట. ఇలాంటి వారు ఎవరెవరు ఉన్నారో కేసీఆర్‌కు రిపోర్టు అందిందట. దానికి సంబంధించి .. తమకు బాగా తెలిసిన మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇప్పటికే ఓ మంత్రి.. కొంత మంది ఎమ్మెల్యేలపై విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఎవరో.. ఆ ఎమ్మెల్యేలు ఎవరో టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా పేర్లు కూడా ప్రచారం అవుతున్నాయి. అందరికీ తెలుసు కానీ.. ఎవరి పేర్లనూ వారు బయటపెట్టడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కేసీఆర్‌కు కొత్త శక్తినిచ్చింది. వాటిల్లో ఓడిపోయి ఉంటే పరిస్థితి తేడాగా ఉండేది. అయితే.. ఎప్పుడూ లేనిది హైదరాబాద్ స్థానంలోనూ గెలవడంతో కేసీఆర్‌లో పాత రాజకీయ నాయకుడు బయటకు వచ్చారు. పార్టీకి ద్రోహం చేయడానికి ప్రయత్నించిన వారి జాబితాను రెడీ చేసుకున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు ఎప్పటికప్పుడు ఇచ్చిన నివేదికల ప్రకారం ఓ మంత్రి.. పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థులకు మాట సాయం చేశారు. టీఆర్ఎస్‌కు ఇబ్బంది కలిగేలా చూశారు. కొంతమంది లోపాయికారీగా ఇతర పార్టీలతో అవగాహన పెట్టుకుటున్నారు. ఈ జాబితాలో కేసీఆర్ అనుమానించేవారితో పాటు.. నమ్మకంగా ఉండేవారు కూడా ఉన్నారని అంటున్నారు.
కొద్ది రోజుల కిందట సీఎం పీఆర్వోగా ఉండే వ్యక్తిని తొలగించారు. ఆ తొలగింపు వెనుక కూడా.. చాలా కథ ఉందని.. ఆయన అవినీతి ఒక్కటే కాదని అంటున్నారు. టీఆర్ఎస్‌లో రెబెల్స్‌గా మారే ప్రమాదం ఉన్న కొంత మంది నేతలకు కేసీఆర్ సమాచారం ఇస్తున్నది ఆ పీఆర్వోనేనని తేలడంతోనే ఆయనను పంపేశారని చెప్తున్నారు. అందుకే.. ప్రధానంగా ఇప్పుడు కేసీఆర్ కోవర్టులపై ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఇదే విషయమై మీడియాలోనూ జోరుగా చర్చ నడుస్తోంది. వారెవరన్నదానిపై కేసీఆర్ చర్యలు తీసుకుంటే కానీ బయటపడే అవకాశాలు కనిపించడం లేదు.