Kavitha: బీఆర్‌ఎస్ బాస్.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయ, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెల్లెలు, నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సౌత్ గ్రూప్‌లో కవిత కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ, సీబీఐ ఆరోపిస్తున్నాయి. ఈమేరకు చార్జిషీట్లలో కవిత పేరును చేర్చాయి. ఈమేరకు గతంలో రెండుసార్లు ఈడీ విచారణకు కూడా పిలిచింది. కవిత వాడిన ఫోన్లు స్వాధీనం చేసుకుంది. కానీ మూడోసారి విచారణకు పిలిచినప్పటి నుంచి కవిత డుమ్మా కొడుతున్నారు.
ఈడీపైనే సుప్రీంలో పిల్..
ఇక లిక్కర్ కుంభకోణంలో తనను ఈడీ విచారణకు పిలవడం, రాత్రి వరకు విచారణ చేయడంపై కవిత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈడీ మరోసారి విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. కానీ, కవిత సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాను విచారణకు రాలేనని సమాధానం ఇచ్చారు. విచారణకు డుమ్మా కొట్టారు.
పండుగ రోజే నోటీసులు..
తాజాగా సంక్రాంతి పండుగ రోజే కవితకు మళ్లీ ఈడీ నోటీసులు పంపింది. జనవరి 16న విచారణకు రావాలని కోరింది. సాయంత్రం మెయిల్ ద్వారా నోటీసులు అందుకున్న కవిత.. ఈసారి వెళ్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగింది. కానీ గంట వ్యవధిలోనే ఈడీకి ఆమె రిప్లయ్ ఇచ్చారు. మళ్లీ ఈసారి కూడా తన పిటీషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నందున విచారణకు హాజరు కాలేనని సమాధానం ఇచ్చారు.
తెగించినట్టేనా..
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇస్తోంది. నాలుగుసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు వెళ్లలేదు. తాను విచారణకు రానని, అవసరమైతే అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ చేశారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్‌కు కూడా ఈడీ నోటీసులు జారీ చేస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ సోరెన్‌కు ఏడుసార్లు నోటీసులు ఇచ్చింది. కానీ ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. ఇప్పుడు కవిత కూడా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. విచారణకు రాకుంటే ఏం చేస్తారు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అన్నట్లుగా ఢిల్లీ, జార్ఖండ్ ముఖ్యమంత్రుల తరహాలో వ్యవహరిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ తనను అరెస్ట్ చేస్తే రచ్చ చేయవచ్చని బీఆర్‌ఎస్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.