Karnataka Assembly Elections 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మే 10 ఒకే విడతలతో ఎన్నికలు జరుగనున్నాయి. ఈమేరకు అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అయితే బీజేపీకి మరోమారు అవకాశం వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఏడాది చివరన జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలో ఎవరు గెలిస్తే.. తెలంగాణలో వారికే అడ్వాంటేజ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అక్కడి రిజల్ట్.. ఇక్కడ రిపీట్!
కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఎక్కువగానే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రం అనే సమీకరణమే కాదు కర్ణాటక తరహాలో కాంగ్రెస్, బీజేపీ కూడా అధికారం కోసం పోరాడుతున్నాయి. రాజకీయాలను చాలా అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఒక రాష్ట్రంలోని ఎన్నికల ఫలితాలు దాని పక్క రాష్ట్రంలో పడటం సర్వసాధారణం. తెలంగాణలో కాంగ్రెస్ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో వారికి నైతిక ధైర్యం కావాలి. ఆ ధైర్యం కర్ణాటక ప్రజలు ఇస్తారని నమ్ముతున్నారు.
కాంగ్రెస్‌లో ఆశలు..
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ నేతలు సంబరాలు చేసుకోవడం ఖాయం. సరిహద్దు ప్రాంతాల్లో ఆ ప్రభావం నేరుగా ఉంటుంది. అలాగే ప్రజల్లో కూడా గెలిచే పార్టీ కాంగ్రెస్ అన్న భావన వస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు కర్ణాటకలో గెలవడానికి ఎలాంటి సహకారమైనా అందిస్తామని అక్కడి నేతలకు చెబుతున్నారు. ప్రచారానికి వెళ్తున్నారు. పాదయాత్రను పక్కన పెట్టి రేవంత్ రెడ్డి కూడా తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేవంత్‌రెడ్డి కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి.
బీజేపీ ధీమా..
దక్షిణాదిన ఎదగాలనుకుంటున్న బీజేపీ కాలం కలసి రావడం లేదు. బీజేపీకి ఉత్తరాది పార్టీ అనే పేరు ఉంది. దీనికి కారణం దక్షిణాదిన ఆ పార్టీకి పెద్దగా బలం లేకపోవడమే. అతి కష్టం మీద కర్ణాటకలో రెండు మూడు సార్లు అధికారం దక్కించుకుంది. కానీ ఇప్పుడు అక్కడ ఎదురుగాలి వీస్తోంది. అయితే సర్వేలు మాత్రం బీజేపీకే అధికారం వస్తుందని అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమలనాథుల్లో ధీమా కనిపిస్తోంది. అక్కడ గెలిస్తే తెలంగాణలో అధికారం ఖాయంని నమ్ముతున్నారు.
తెలుగు వారి ఓట్లు కీలకం..
కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజల ఓట్లను కీలకంగా భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కూడా తెలుగు ఓటర్లను టార్గెట్‌గా చేసుకుని అక్కడ రాజకీయాలు చేయాలని చూస్తోంది. పోటీ చేసే అవకాశం మాత్రం కనిపించడం లేదు. అయితే జేడీఎస్‌కు మద్దతు పలికే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్ మద్దతులో జేడీఎస్ కింగ్ మేకర్ అయితే.. భారత రాష్ట్ర సమితికి అడ్వాంటేజ్ అవుతుంది.
మొత్తంగా ఏరకంగా చూసినా కర్ణాటక, తెలంగాణ రాజకీయాలు ఒకే విధంగా కనిపిస్తున్నాయి. అందుకే కర్ణాటకలో తమ పార్టీ గెలుపు కోసం బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.